టీవీ 9 వివాదానికి సంబంధించి శివాజీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే శివాజీని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీవీ9 వివాదానికి సంబంధించి శివాజీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇక తదుపరి అరెస్టే అని అంటున్నారు. టీవీ9 సి.ఈ.ఓ రవిప్రకాష్‌తో కలిసి నటుడు శివాజీ కుట్ర చేశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
సంస్థకు సంబంధించిన ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు, సంస్థకు సంబంధించిన నిధుల మళ్లింపు ప్రక్రియ.. తదితర అంశాలలో రవిప్రకాష్‌కు నటుడు శివాజీ వెన్నుదన్నుగా ఉన్నారనీ, ఛానెల్ నిర్వహణ తన ఇష్ట ప్రకారం జరగాలన్న పంతంతో పలు రకాల కుట్రలు చేసే ప్రయత్నం చేశారనీ వీటిన్నింటి వెనుక శివాజీ హ్యాండ్ కూడా ఉన్నట్లు అనుమానించడంతో ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. గతంలో టీవీ 9లో తనకూ వాటా ఉందంటూ శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కోణంలోనే ఇప్పుడు తలెత్తిన ఈ వివాదంలో శివాజీ ఇరుక్కోవడం జరిగింది.
సినిమాల్లో హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శివాజీ, గతకొంత కాలంగా సినిమాలకు దూరమై, రాజకీయాలంటూ జనంతో మమేకమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫలానా పార్టీ అని లేదు కానీ, తెలుగు దేశం పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా ఆయన మాటల ద్వారా అర్ధమవుతోంది. చూడాలి మరి ఈ తాజా వివాదం నుండి శివాజీ ఎలా బయటపడతారో. ఇంతవరకూ ఈ విషయమై శివాజీ ఎక్కడా స్పందించలేదు.