సినీ నటుడు శివాజీ కాస్తా గురుడ పురాణం శివాజీ అయిపోయాడిప్పుడు కొంత కాలం క్రితం పలు రాజకీయ వివాదాల కారణంగా. టీవీ 9ని ఇటీవల టేకోవర్ చేసిన యాజమాన్య సంస్థ అలంద మీడియా, తమ సంస్థలో మాజీ సీఈఓ రవిప్రకాష్, ఆయనతోపాటు సినీ నటుడు శివాజీ అక్రమాలకు పాల్పడినట్లు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటికే ఈ కేసులో రవిప్రకాష్ ని విచారించిన సంగతి తెల్సిందే.
కాగా, పలుమార్లు నోటీసులు అందుకున్నప్పటికీ, శివాజీ ఇప్పటిదాకా పోలీసుల యెదుట విచారణకు హాజరు కాలేదు. ఇదిలా వుంటే, బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో సైబర్ క్రైమ్ పోలీసులు శివాజీని గుర్తించి ఆయన్ని అదుపులోకి తీసుకుని, సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. టీవీ 9 అక్రమాస్థుల కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంతవరకూ అజ్ఞాతంలో ఉన్న శివాజీ బుధవారం ఉదయం విదేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నించగా, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. టీవీ 9లో అక్రమాలకు పాల్పడ్డారంటూ రవిప్రకాష్ ని అలంద మీడియా సంస్థ సీఈఓ పదవి నుండి ఆయన్ని తొలిగించిన సంగతి తెలిసిందే.
ఆ కేసుతో సంబంధం ఉన్న శివాజీ కోసం అప్పటి నుండీ పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి కాస్త హీట్ తగ్గడంతో, అజ్ఞాతంలో నుండి బయటికి వచ్చిన శివాజీ విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో పోలీసులకు చిక్కారు. తనకు సంబంధం లేని రాజకీయాల్లోకి తలదూర్చి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లైంది శివాజీ పరిస్థితి అని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న శివాజీ పరిస్థితేంటో వేచి చూడాలిక.