యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ తో మెల్లమెల్లగా అడుగులు వేసుకొంటూ ఎదిగాడు సుహాస్. ఇప్పుడు వెండి తెరపై విజృంభిస్తున్నాడు. తన చేతిలో ఏకంగా 8 సినిమాలున్నాయి. రెండేళ్ల వరకూ తను ఖాళీ లేడు. ఎంత మంచి కథ చెప్పినా, ఎంత మంచి బ్యానర్ ఆఫర్ ఇచ్చినా, ఎంత పారితోషికం ఇస్తానన్నా.. ఇప్పటికిప్పుడు సుహాస్ డేట్లు దొరకడం కష్టం. అంతలా బిజీ అయ్యాడు. అలాగని సుహాస్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర అద్భుతాలేం సృష్టించలేదు. పాజిటీవ్ టాక్‌తో ఓకే అనిపించుకొన్నాయి. ఇటీవల విడుదలైన చిత్రాలు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్నవదనం మంచి సినిమాలుగా పేరు తెచ్చుకొన్నాయి. కానీ బాక్సాఫీసు రిజల్ట్ ఆశాజనకంగా లేదు. అయినా సరే, సుహాస్‌కు ఇన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయి? ఇంత బిజీగా ఎలా మారిపోయాడు?
ఎందుకంటే... సుహాస్ ఓటీటీ మార్కెట్ బలంగా ఉంది. తన గత చిత్రాలన్నింటికీ ఓటీటీ బిజినెస్ అయిపోయింది. ప్రసన్నవదనంతో సహా. ఈ సినిమాని ఆహా కొనేసింది. సగం పెట్టుబడి ఓటీటీ రూపంలోనే తిరిగొచ్చింది. సుహాస్ చేతిలో ఉన్న 8 చిత్రాల్లో నాలుగింటికి ఓటీటీ సంస్థలు అడ్వాన్స్ ఇచ్చేశాయి. అదీ..సుహాస్ ధైర్యం. అయితే.. ఇటీవల ఓటీటీ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. కేవలం ఓటీటీ రైట్స్ పై ఆశలు పెట్టుకొని సుహాస్ తో సినిమా చేయడం రిస్కే. 8 సినిమాల్లో 4 చిత్రాలకు ఓటీటీ అయిపోతే, మరో 4 చిత్రాలు అలానే ఖాళీగా ఉన్నాయి. టీజర్, ట్రైలర్‌తో బజ్ వస్తే తప్ప, వాటికి ఓటీటీ మార్కెట్ ఓపెన్ అవ్వదు. లేదా... చేతిలో ఉన్న సినిమాల్లో రెండు మూడు హిట్టయితే మళ్లీ సుహాస్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. చిన్న హీరోల్లో, ఓటీటీ మార్కెట్ ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. అందుకే తనకు ఇన్ని ఆఫర్లు అందుతున్నాయి. సుహాస్ కూడా తనకు తగ్గ కథల్ని, కంటెంట్ ఉన్న సినిమాల్నీ ఎంచుకొంటున్నాడు. అందుకే రాణిస్తున్నాడు.