నువ్వే కావాలి, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను.... ఇలా వరుసగా హిట్ల మీద హిట్లు ఇచ్చాడు తరుణ్. లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకుని - కొన్నాళ్లు ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అయితే ఆ తరవాత దురదృష్టం వెంటాడింది. ఒక్కటంటే ఒక్క హిట్టూ పడలేదు. కొన్నాళ్లుగా, కొన్నేళ్లుగా తరుణ్ ఖాళీనే. అయితే ఇప్పుడు మళ్లీ తరుణ్ పేరు వినిపించడం మొదలెట్టింది. హీరోగా కాదు. డబ్బింగ్ ఆర్టిస్టుగా. ఇటీవల `ఆహా`లో విడుదలైన మలయాళ అనువాద చిత్రం `అనుకోని అతిథి`. ఇందులో ఫాజిల్ పోషించిన పాత్రకు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. ఫాజిల్ నటనకు తరుణ్ గొంతు పర్‌ఫెక్ట్‌గా సరిపోయింది.
అల్లు అర్జున్ `పుష్ష`లోనూ ఫాజిల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకూ తరుణ్ తో డబ్బింగ్ చెప్పించాలనుకుంటున్నార్ట. ఇటీవల మలయాళం నుంచి తెలుగులో చాలామంది నటులే వస్తున్నారు. వాళ్లందరికీ... డబ్బింగ్ చెప్పడం అవసరం. ఆ పాత్రని తరుణ్ సమర్థవంతంగా పోషించగలడు అనే నమ్మకం కలుగుతోంది. ఒకవేళ పాజిల్ పాత్రకు తరుణ్ ని పర్మినెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తరుణ్ కి ఎలాగూ హీరో పాత్రలు రావడం లేదు. కనీసం ఇలాగైనా బిజీగా ఉంటాడేమో చూడాలి. అన్నట్టు తరుణ్ తల్లి రోజా రమణి కూడా పేరున్న డబ్బింగ్ ఆర్టిస్టే.