చిత్రసీమలో అన్నీ పై పై మెరుగులే. వాటికే పడిపోతుంటారు జనమంతా. ఇదో ఊబి. దిగితే... బయటకు రావడం కష్టమే. ఈ ఊబిలో కూరుకుపోవడం, ఫాల్స్ ప్రెస్టేజీలో ఆస్తులు అమ్ముకోవడం మినహా మరో మార్గం ఉండదు. ఓ హీరో అలానే ఈ ఊబిలో దిగిపోయాడు. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాడని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. విశాల్. పందెం కోడి లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. ఆ తరవాత చక చక సినిమాలు చేశాడు. అందులో హిట్లూ ఉన్నాయి.
కాకపోతే. ఫ్లాపుల సంఖ్య చాలా ఎక్కువ. ఒక హిట్టు కొడితే, వరుసగా అరడజను సినిమాలు ఫ్లాపు. విచిత్రం ఏమిటంటే... ఆయా సినిమాలకు తానే నిర్మాత. మరొకరి పేరు పోస్టర్ పై కనిపించినా, తెర వెనుక విశాలే ఉండేవాడు. కొన్ని సినిమాల కోసం చేసిన అప్పుడు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. తన సినిమా అంటే.. విడుదలకు ముందు టెన్షన్ తప్పనిసరి అయిపోతోంది. ఎందుకంటే పాత బాకీలు వెంటపడడం వల్ల, చాలాసార్లు రిలీజ్ డేట్లు ఆగిపోయాయి. ఇప్పటికీ ఒకట్రెండు కేసులు కోర్టుల్లో నలుగుతున్నాయి.
విశాల్ కి 50 నుంచి 70 కోట్ల వరకూ అప్పులు ఉండొచ్చన్నది భోగట్టా. వాటన్నింటినీ ఈ యేడాది వరుసగా క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నాడట. తన పేరు మీద ఉన్న కొన్ని స్థిరస్థులూ తాకట్టులో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఊబిలోంచి ఈ హీరో ఎప్పుడు బయటపడతాడో. ఒకట్రెండు హిట్లు కొడితే చాలు. మళ్లీ గాడిన పడొచ్చు. మరి ఈలోగా ఎన్ని ఫ్లాపులు వస్తాయి... అనేది మరో పెద్ద ప్రశ్న.