ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత విసు కన్నుమూశారు. ఆడదే ఆధారంలో మావయ్యగా నటించిన విసు గుర్తున్నారు కదా? ఆయనే ఈయన. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన కొన్ని చిత్రాల్లోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు. కె. బాలచందర్ దగ్గర శిష్యరికం చేసిన విసుకి నాటక రంగ అనుభవం ఉంది. విసు నటించిన. `ఆడదే ఆధారం` తెలుగులో మంచి హిట్. అప్పటి నుంచి ఆయనకు తెలుగులోనూ గుర్తింపు లభించింది.
తెలుగులో ఎక్కువగా నటించలేదు గానీ, రజనీకాంత్ - కమల్ హాసన్ లాంటి ఉద్దండుల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆయా చిత్రాలు తెలుగులోనూ డబ్ అవ్వడం వల్ల.. తెలుగు నటుడిగానూ ఆయన చలామణీ అయ్యారు. తెలుగులో సూపర్ హిట్ అయిన సంసారం ఒక చదరంగం సృష్టికర్త విసునే. ఆయన రూపొందించిన తమిళ చిత్రాన్ని తెలుగులో గొల్లపూడి మారుతీరావుతో రీమేక్ చేశారు. సింహాచలం లోనూ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. విసు వయసు 75ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.