ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ఇకలేరు..!

మరిన్ని వార్తలు

న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గా బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌ను చూపించి, గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌లో త‌న పేరు శాశ్వ‌తంగా లిఖించుకున్న విజ‌య నిర్మ‌ల ఇక లేరు. హైద‌రాబాద్‌లోని  కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  బుధవారం అర్థ‌ రాత్రి గుండెపోటుతో మరణించారు. 1946 ఫిబ్రవరి 20న  తమిళనాడులో జన్మించారు విజయనిర్మల. బాల‌నటిగా రంగ ప్ర‌వేశం చేసిన విజ‌య నిర్మ‌ల‌.. దాదాపు 200 చిత్రాల‌లో క‌థానాయిక‌గా మెరిశారు. 44 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 15 సినిమాల్ని నిర్మించారు కూడా.  తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం సూప‌ర్ స్టార్  కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ప్ర‌ముఖ న‌టుడు న‌రేష్‌.. విజ‌య నిర్మ‌ల కుమారుడే.

ఏడేళ్ల వ‌య‌సులోనే నాట్యం నేర్చుకుని, ప‌దేళ్ల‌కు ఆరంగేట్రం చేశారు. అనుకోకుండా సినిమాల్లో బాల `నటుడి`గా అవ‌కాశం వ‌చ్చింది. చిన్న‌ప్పుడు వేసిన‌వ‌న్నీ మ‌గ‌రాయుడు వేషాలే. రంగుల‌రాట్నం సినిమాతో క‌థానాయిక‌గా మారిపోయారు. అక్క‌డి నుంచి వెనుదిరిగి చూసుకునే అవ‌స‌ర‌మే రాలేదు. తెలుగు, మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టిగా మెరుస్తూ, ఎన్నో విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్నీ ఇలా అన్నీ హిట్లే.

సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో విజ‌య నిర్మ‌ల తొలిసారి న‌టించిన చిత్రం `సాక్షి`. ఆ త‌ర‌వాత ఏకంగా 50 సినిమాల్లో వీరిద్ద‌రూ జోడీగా క‌నిపించారు. ఓ జంట ఇన్ని సినిమాలు చేయ‌డం... బ‌హుశా ప్ర‌పంచ చ‌ల‌న చిత్ర సీమ‌లోనే ఓ రికార్డు.  సాక్షి స‌మ‌యంలోనే కృష్ణ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ అనుబంధం ప్రేమ‌గా మారింది. తిరుప‌తిలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.

ద‌ర్శ‌కురాలిగా విజ‌య నిర్మ‌ల త‌న‌దైన ముద్ర వేశారు. ద‌ర్శ‌క‌త్వ రంగంలో మ‌హిళ‌లు చాలా త‌క్కువ‌. ఉన్నా అర‌కొర సినిమాలే తీశారు. కానీ విజ‌య నిర్మ‌ల మాత్రం ఏకంగా 44 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ప్ర‌పంచ రికార్డు స్థాపించారు.

దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. విజ‌య నిర్మ‌ల లేని లోటు పూడ్చ‌లేనిది. న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా ఆమె చేసిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి.

ఆమె మృతికి ఐ.క్లిక్ మూవీస్ ప్ర‌గాఢ నివాళి అర్పిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS