ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెడుతోంది సమంత. కథానాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలు సమంతకి అందాలన్నా, సమంత కోసం కథలు పుట్టాలన్నా - కమర్షియల్‌గా సమంత హిట్టు కొట్టాల్సిందే. అయితే `యూ టర్న్` మాత్రం కాస్త నిరాశ పరిచింది. విమర్శకులు ఈ సినిమాని మెచ్చుకున్నా - బాక్సాఫీసు దగ్గర ఆశించిన ఫలితం రాలేదు. సమంత కొత్త సినిమా `ఓ బేబీ` కూడా లేడీ ఓరియెంటెడ్ కథే. `యూ టర్న్` ఫలితం ఓ బేబీపై పడుతుందేమో అని దర్శక నిర్మాతలు కాస్త భయపడ్డారు.
కానీ... `ఓ బేబీ` స్వీట్ షాక్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే లాభాలలో నిలిచింది. దాదాపు రూ.13 కోట్లతో పూర్తయిన సినిమా ఇది. విడుదలకు ముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. రెండింటి ద్వారా దాదాపు 5 కోట్లు వచ్చాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో రూ.3 కోట్లు లభించాయి. ఓవర్సీస్ నుంచి మరో 1.75 కోట్లు వచ్చాయి. కర్నాటక రైట్స్ కూడా అమ్ముడుపోయాయి.
ఆంధ్రా, నైజాం హక్కులు నిర్మాతల చేతుల్లో ఉండగానే పెట్టుబడి తిరిగొచ్చేసింది. అంటే.. ఆంధ్రా, నైజాంల నుంచి వచ్చిన ప్రతీ రూపాయీ... లాభమే అన్నమాట. విడుదలకు ముందే సినిమా బిజినెస్ పూర్తవ్వడం, రెండు ఏరియాలు ఉండగానే పెట్టుబడి తిరిగొచ్చేయడం సమంత మ్యాజిక్. ఓ బేబీ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో సమంత చేతికి మరిన్ని కొత్త కథలు వచ్చే అవకాశాలున్నాయి.