బెంగూళూరు రేవ్ పార్టీ ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పార్టీలో ఎంతమంది హేమా హేమీలు, సెలబ్రెటీలు ఉన్నా, అందరి నోళ్లల్లో నానుతున్న పేరు హేమ. డ్రగ్స్ పార్టీలో హేమ ఉందన్న వార్తలు రావడం, వెంటనే హేమ ఓ వీడియో విడుదల చేసి, తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టు నమ్మించడం, ఆ తరవాత బెంగళూరు పోలీసులు హేమ చెబుతోంది అబద్ధమని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడం ఇవన్నీ తెలిసిన విషయాలే. మీడియా వాళ్లకు ఫోన్‌లో టచ్‌లో ఉన్న హేమ నేను ఏ తప్పూ చేయలేదు అనే అంటోంది. త్వరలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టి, అన్ని విషయాలూ చెబుతానంటోంది.
అయితే ఇంతలోనే మరో ట్విస్ట్. నార్కోటిక్ బృందం చేసిన రక్త పరిక్షల్లో హేమ దొరికిపోయింది. హేమ డ్రగ్స్ తీసుకొన్న ఆధారాలు దొరికాయని నార్కొటిక్ బృందం ప్రకటించింది. హేమతో పాటు 150 మంది బ్లడ్ శాంపిల్స్‌ని నార్కొటిక్ బృందం సేకరించింది. అందులో 86 మందికి పాజిటీవ్ వచ్చింది. ఆ లిస్టులో హేమ పేరు కూడా ఉండడం గమనార్హం. మరి ఇంత వరకూ తాను ఆ పార్టీలో లేనని, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చిన హేమ.. ఇప్పుడు ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.