హార్ట్ ఎటాక్‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది ఆదా శర్మ. అందం, టాలెంట్ ఉన్నా, తెలుగులో అవకాశాలు పెద్దగా దొరకలేదు. బాలీవుడ్ లో మాత్రం మంచి గుర్తింపే సంపాదించింది. ఇప్పుడు అక్కడ ఓ వినూత్నమైన పాత్ర పోషించబోతోందట. ఆదా ప్రధాన పాత్రలో `మ్యాన్ టూ మ్యాన్` అనే సినిమా తెరకెక్కనుంది.
ఇందులో ఆదా లింగమార్పిడి చేయించుకున్న అమ్మాయిగా కనిపించబోతోందట. అబ్బాయిగా పుట్టి, అమ్మాయిగా మారే పాత్ర లో ఆదా కనిపించబోతోందట. అలాంటి అమ్మాయి ఓ అబ్బాయిని పెళ్లాడితే, జరిగే పరిణామాలేంటి? అనేదే సినిమా కథ. స్టోరీ చాలా ఆసక్తిగా ఉంది కదా. కానీ.. ఇలాంటి పాత్ర చేయడం చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం. కానీ ఆదా మాత్రం.. `నాకు రిస్కులంటేనే ఇష్టం. అందుకే ఈ తరహా పాత్రల్ని ఎంచుకుంటున్నా` అంటోంది. ఈ సినిమాని తెలుగులో సైతం విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈసారి ఆదాకి ఎలాంటి ప్రతిఫలం దొరుకుతుందో చూడాలి.