తారాగణం: బంటి, రవిబాబు, అభిషేక్ వర్మ, నభ నటేష్ & తదితరులు
నిర్మాణ సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్ & ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్
సంగీతం: ప్రశాంత్ విహారి
నిర్మాత: సురేష్ బాబు
రచన-దర్శకత్వం: రవిబాబు
రేటింగ్:1.5/5
పంది అనగానే చిరాకైనా కలుగుతుంది, లేదంటే తినడానికి బాగుంటుందనైనా అనుకొంటారని రవిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎలాగో ఇక్కడ సినిమాలో పంది కాబట్టి తినడానికి సాధ్యం కాదు. ఇక చేయాల్సింది చిరాకు కలగకుండా చూపించడమే. ఆ విషయంలో రవిబాబు కొద్దిమేర సఫలమయ్యాడు.
అక్కడక్కడా పంది కాస్త ముద్దుగానే కనిపిస్తుంది. రవిబాబుకి మాత్రం మరీ ముద్దుగా కనిపించిందేమో తెలియదు కానీ... దాంతో రౌడీలకి ముద్దులు కూడా పెట్టించాడు. అది చాలదన్నట్టు ఇంకా చాలా చేయించాడు. అయితే పంది పిల్లని బాగానే చూపించాడు కానీ.. ఆ పంది పక్కన కనిపించే పాత్రల్ని మాత్రం వాటికంటే మురికిగా చూపించిన విధానమే ప్రేక్షకుడికి ఒక పట్టాన మింగుడు పడదు. ఇంతకీ `అదుగో` కథేమిటో చూద్దాం.
* కథ
సిక్స్‌ప్యాక్ శక్తి (రవిబాబు)కీ, అతని ప్రత్యర్థి దుర్గకీ భూ దందా విషయంలో గొడవలుంటాయి. ఇద్దరి గొడవల్లోకి అనుకోకుండా బంటి అనే పంది పిల్ల చిక్కుకుంటుంది. తండ్రి మాట కాదని బయటికి వెళ్లిన బంటి రౌడీల చేతికి చిక్కి హైదరాబాద్ చేరుకుంటుంది. భూమికి సంబంధించిన సమాచారం ఉన్న మైక్రోచిప్‌ని అనుకోకుండా బంటి మింగేయడమే అందుకు కారణం.
దాంతో రెండు ముఠాలు బంటి కోసం వేట మొదలుపెడతాయి. ఇది చాలదన్నట్టు హైదరాబాద్‌లో మరో రెండు ముఠాలకి కూడా బంటీనే అవసరమవుతుంది. నాటకీయ పరిస్థితుల మధ్య రాజీ (నభానటేష్), అభిషేక్ (అభిషేక్ వర్మ) అనే ప్రేమజంట చేతుల్లోకి వెళ్లిన బంటి ఎలాంటి పరిస్థితుల మధ్య తప్పించుకొంది? తిరిగి తన ఇంటికి ఎలా వెళ్లిందనేదే మిగతా సినిమా.
* నటీనటులు
నటీనటుల్లో రవిబాబుకే ఎక్కువ మార్కులు పడతాయి. సిక్స్‌ప్యాక్ శక్తి పాత్రలో ఆకట్టుకుంటాడు. ప్రేమజంటగా అభిషేక్, నభా కనిపిస్తారు. నభా అందంగా కనిపించినా ఆమె పాత్ర పరిధి తక్కువే. ఆర్కే, విజయ్ సాయి పరిధి మేరకు నటించారు.
* విశ్లేషణ
జంతువులతో విన్యాసాలు చేయిస్తూ వినోదం... అవి ప్రదర్శించే విశ్వాసం నేపథ్యంలో భావోద్వేగాలు పండిస్తూ విజయాల్ని అందుకొన్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ తరహా సినిమాలు తెలుగులో చాలానే తెరకెక్కాయి. ఈగలాంటి అతి చిన్న ప్రాణితో రాజమౌళి చేయించిన విన్యాసాలు, దాంతో పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే పందిపిల్ల ప్రధాన పాత్రధారిగా రవిబాబు సినిమా తీస్తున్నాడనగానే `అదుగో`పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
కానీ దర్శకుడు అటు సాంకేతితకీ సరిగ్గా వాడుకోక, ఇటు కథతోనూ ఆసక్తి రేకెత్తించక మమ అనిపించాడు. దానికితోడు కొన్ని పాత్రల్ని, వాటి నడవడికని చూడలేం అనిపించేలా తీర్చిదిద్ది ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాడు. ఒక పాత్ర ఎదురుగా ఎవరు కనిపిస్తే వాళ్లపై ఉమ్మేస్తుంటుంది. ఆ పాత్ర చేసే యాగీ చూస్తే మనం చూస్తున్నది వెండితెరా లేక ఉమ్మితొట్టా అనిపిస్తుంది. అదుగో తీసిన నిర్మాత సురేష్‌బాబు నిర్మించిన ఈగనే తీసుకుంటే అందులో అది చిన్న ప్రాణే అయినా... ప్రతినాయకుడిని గడగడలాడిస్తుంది. అదే సమయంలో ఈగ చేసే ప్రతి పని కూడా చాలా లాజిక్‌గా అనిపిస్తుంది.
కానీ ఈ సినిమాలో మాత్రం ఆ మేజిక్ ఎక్కడా కనిపించదు. అక్కడక్కడా పందితో విన్యాసాలు చేయించారు కానీ... అవి కూడా ప్రేక్షకుడు నమ్మదగినట్టుగా అనిపించవు. సిల్లీగా, ఏమాత్రం లాజిక్ లేకుండా తనదైన శైలిలో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ కథలో కూడా చాలా గందరగోళం ఉంటుంది. అనేక ఉపకథలు ఉంటాయి. దాంతో అడుగడుగునా గందరగోళమే. ఎవరు ఎవరికోసం వెదుకుతున్నారో తెలియని పరిస్థితి.
లైవ్ యానిమేషన్, యానిమేట్రిక్స్ విధానంతో సినిమా తీస్తున్నప్పుడు, అత్యున్నత సాంకేతికతని వాడుతున్నప్పుడు అందుకు తగ్గ కథ కూడా రాసుకోవాలి. ఆ విషయంలోనే దర్శకుడు విఫలమయ్యాడు.
* సాంకేతికత
సాంకేతికంగా సినిమాకి పేరు పెట్టలేం. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో ఒదిగిపోయాయి. పందిపిల్లని సహజంగా చూపించారు. కళ, ఎడిటింగ్ విభాగాలు కూడా చక్కటి పనితీరును కనబరిచాయి. సుధాకర్‌రెడ్డి కెమెరాపనితనం, ప్రశాంత్ విహారి సంగీతం దర్శకుడి ఆలోచనలకి, కథకి తగ్గట్టుగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడే కథ విషయంలోనూ, వినోదం పండించడంలోనూ విఫలమయ్యారు.
* తీర్పు
రవిబాబు సినిమాల్లో పాత్రలు చేసే అల్లరి మంచి వినోదాన్ని పండిస్తాయి. కానీ ఇందులో పాత్రలు మాత్రం రవిబాబు క్రియేటివిటీని అల్లరిపాలు చేసినంత పనిచేశాయి. 110 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఆద్యంతం రేసీగా సాగినా... ఎప్పుడు పూర్తవుతుందా అని ప్రేక్షకుడు ఎదురు చూస్తుంటాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రివ్యూ రాసింది శ్రీ.