ఈ మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం 'ఆదిపురుష్' ప్రకటన వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ సినిమాను టి-సిరీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేయాల్సి ఉంటుందని, దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ సినిమా కథను మొదట హృతిక్ రోషన్ కు దర్శకుడు ఓం రౌత్ వినిపించారట.
అయితే హృతిక్ అప్పటికే ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించరు లేదట. చాలాకాలం పాటు వేచి చూసిన ఓం రౌత్ ఇక లాభం లేదనుకుని మరో యువ బాలీవుడ్ హీరోను సంప్రదించారట. అయితే అతను కూడా ప్రాజెక్టు విషయంపై ఎటూ తేల్చకుండా నెలల తరబడి నాన్చడంతో ఫైనల్ గా ప్రభాస్ ను సంప్రదించారట. కథ వినగానే ప్రభాస్ కు నచ్చడంతో, ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా పచ్చజెండా ఊపారట. దీంతో ప్రాజెక్టు ఖరారు అయిందని సమాచారం. ఒకరకంగా చూసుకుంటే ఇప్పుడు హృతిక్ రోషన్ మార్కెట్ కంటే ప్రభాస్ మార్కెట్ ఎక్కువ. దీంతో ఈ ప్రాజెక్టు స్థాయి మరింతగా పెరిగిందని చెప్పుకోవాలి. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఘనవిజయం సాధిస్తే మాత్రం హృతిక్ రోషన్ ఒక మంచి సినిమాను మిస్ అయినట్లే అనుకోవాలి.