ఆగస్టు 22... చిరంజీవి అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే.. అది చిరు పుట్టిన రోజు. ఈ సందర్భంగా... `ఆచార్య` ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయడానికి చిత్రబృందం రెడీ అయ్యింది. 22 తేదీన సాయింత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్ చూడొచ్చు. నిజానికి చిరు బర్త్ డే సందర్భంగా ఓ చిన్న డైలాగ్ టీజర్‌ని రీలీజ్ చేయాలని కొరటాల భావించాడట. రఫ్‌గా 15 సెకన్ల బుల్లి టీజర్ కట్ చేసి చిరుకి చూపించాడట.
కానీ చిరు మాత్రం టీజర్‌కి నో చెప్పాడట. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలు.. టీజర్‌కి ఇంకా చాలా టైమ్ ఉందని... కొరటాలని వారించినట్టు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి రావల్సిన సినిమా ఇది. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే... 2021 వేసవికి కూడా ఆచార్య రావడం కష్టంగానే తోస్తోంది. అందుకే... ఇంత త్వరగా టీజర్ వద్దన్నది చిరు భావన. లేదంటే... ఈ పుట్టిన రోజున టీజర్ వచ్చేసేదే. కానీ ఈసారికి కేవలం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌తో సరిపెట్టుకోవాల్సివస్తోంది.