కొబ్బిరి కాయ కొట్టక ముందే టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండ్రస్ట్రీ గా మారిన సినిమా `ఆది పురుష్`. ప్రభాస్ హీరో అవ్వడం వల్ల - ఈ ప్రాజెక్ట్‌పై విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. రామాయణం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, ప్రభాస్ ని రాముడిగా చూపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తోంది. దానికి తోడు ప్రభాస్ అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్లలో ప్రభాస్‌ని రాముడిగా చూపిస్తూ - మరో అడుగు కూడా ముందుకేసేస్తున్నారు.
అయితే ఈ సినిమాపై ఇప్పుడు మరో షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే.. ఈ సినిమాకీ , రామాయణానికీ అస్సలు సంబంధం లేదట. ఇది రామాయణం కాదని, అసలు అందులోని ఘట్టాలకూ ఈ కథకూ సంబంధం లేదని తెలుస్తోంది. అయితే.. ప్రభాస్ పాత్రలో రాముడి లక్షణాలు కనిపిస్తాయని, ప్రతీ పాత్రకీ రామాయణం రిఫరెన్స్ అని, అది మినహా.. రామాయణానికీ ఈ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదని ఇన్ సైడ్ వర్గాల టాక్. మరి ఈ సినిమాకి పౌరాణిక టచ్ ఎందుకు ఇస్తున్నారో, త్రీడీలో ఎందుకు తీస్తున్నారో.. ఇవన్నీ సందేహాలే. చిత్రబృందం నోరు విప్పేంత వరకూ ఈ సస్పెన్స్ తప్పదు.