హీరోలు.. వెండి తెరపైనే హీరోలు. బయట జీరోలన్న సంగతి ఏదో ఓ రూపంలో.. నిజం అవుతూనే ఉంటుంది. కోట్లకు కోట్లు సంపాదిస్తున్న హీరోలు, చిన్న చిన్న విషయాలకు కక్కుర్తి పడడం.. వాళ్ల అభిమానుల్ని సైతం విస్మయపరుస్తోంది. మొన్నటికి మొన్న తమిళనాడు స్టార్ హీరో విజయ్ కోర్టుకెక్కాడు. తను కొన్న ఖరీదైన కారుకి పన్ను మినహాయింపు కోరాడు. దాంతో కోర్టు మొట్టికాయలు వేసింది. సెలబ్రెటీలు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కోర్టుకి రాకూడదని అక్షింతలు వేస్తూ, కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ.లక్ష జరిమానా కూడా విధించింది.
ఇప్పుడు ధనుష్ కూడా అదే పొరపాటు చేశాడు. తను కొత్తగా ఓ ఖరీదైన కారు కొన్నాడు. ఈ కారుకి పన్ను మినహాయింపు కోరుతూ కోర్టుకెక్కాడు. అయితే ధనుష్ కి కూడా విజయ్ కి ఇచ్చిన ట్రీట్మెంటే ఇచ్చింది కోర్టు. సామాన్యులు సబ్బు కొన్నా, పన్ను కడుతున్నారని, వాళ్లెప్పుడూ పన్ను మినహాయింపు అడగలేదని, సెలబ్రెటీలు మాత్రం ఇలా మినహాయింపు అడుగుతూ వాళ్ల స్థాయి తగ్గించుకుంటున్నారని, ఈ విషయంలో పిటీషన్లు వేసే న్యాయవాదులు కూడా హీరోలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఇలా వరుసగా స్టార్ సెలబ్రెటీలకు కోర్టు చివాట్లు పెట్టడంతో భవిష్యత్తులో ఏ హీరో మళ్లీ ఇలాంటి సాహసం చేయరేమో..?