తెలుగు హీరోలు పక్క భాషలోనూ సినిమాలు చేసి, తమ మార్కెట్ ని పెంచుకోవాలనుకుంటున్నారు. తమిళ హీరోలు సైతం సేమ్ టూ సేమ్ ఇలానే ఆలోచిస్తున్నారు. సూర్య, కార్తి, విక్రమ్, విజయ్ లాంటి వాళ్లకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ల డబ్బింగ్ బొమ్మలు ఇక్కడ కాసుల వర్షం కురిపించుకుంటాయి. అందుకే తెలుగులోనూ నేరుగా సినిమాలు చేసేద్దాం అని ఫిక్సవుతున్నారు వాళ్లంతా. సూర్య, కార్తి ఎప్పటి నుంచో ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా విజయ్ వంతు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. దిల్ రాజు నిర్మాత. త్వరలోనే ఈసినిమా మొదలు కానుంది.
ఇప్పుడు ధనుష్ కూడా విజయ్ బాటలోనే నడవడానికి సిద్ధమయ్యాడు. తాను కూడా తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేయడానికి ఓకే అన్నాడట. టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు, బడా నిర్మాణ సంస్థ కలిసి ఈ ప్రాజెక్టుని తెరకెక్కించబోతున్నారు. ధనుష్ తో సినిమా చేస్తే.. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ, కావాలనుకుంటే హిందీలోనూ మార్కెట్ చేసుకోవొచ్చు. కాబట్టి.. నిర్మాతలు ముందే సేఫ్ లోకి వెళ్లిపోతారు. అందుకే... ధనుష్ ఎంట్రీ దాదాపుగా ఖాయమైపోయిందని టాక్. మరి రాబోయే రోజుల్లో మరెంత మంది తమిళ తంబీలు ఈ బాటలో నడుస్తారో చూడాలి.