జేమ్స్ బాండ్ కథలకున్న ఆదరణే వేరు. హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాల్నిచూసి.... మన ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. ఆ ట్రెండ్‌ని తెలుగులోకి తీసుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణే. జేమ్స్ బాండ్, గూఢచారి కథలు తెలుగులో ప్రాణం పోసుకున్నాయి. చిరంజీవి అయితే `చంటబ్బాయ్`లా నవ్వించాడు.
జేమ్స్ బాండ్ కథల్లో ఎంత కామెడీ ఉంటుందో.. `చంటబ్బాయ్` ద్వారా చూపించారు జంథ్యాల. ఆమధ్య తెలుగులో `గూఢచారి` సినిమా వచ్చింది. సీరియెస్‌గా సాగిన క్రైమ్ థ్రిల్లర్ అది. ఇప్పుడు తెలుగులో మరో జేమ్స్ బాండ్ కథ వస్తోంది. అదే.. `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`.
స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్, శ్రుతిశర్మ జంటగా నటించారు. టీజర్ కూడా వచ్చేసింది. అది చూస్తుంటే.. ఆనాటి చంటబ్బాయ్ గుర్తుకొస్తుంది. తన అమాయకత్వంతో చంటబ్బాయ్ ఎంతలా నవ్వించాడో.. ఈసారి ఏజెంట్ శ్రీనివాస ఆచార్య కూడా అంతే నవ్విస్తాడన్న ధీమా కలుగుతోంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా కొత్తవారే.
కాకపోతే టీజర్ చూస్తే కామెడీ బాగా వర్కవుట్ అయినట్టు అనిపిస్తోంది. టీజర్‌లో చూపించినట్టు సినిమా మొత్తం కామెడీనే ఉంటుందా? లేదంటే మధ్యలో సీరియెస్ టర్న్ తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి. డిసెంబరులో ఈ సినిమా విడుదల కానుంది.