13 బి, ఇష్క్, మనం, 24 ఇలా వైవిధ్యభరితమైన చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్. ఇప్పుడు ఈ దర్శకుడికి ఫైన్ పడింది. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్‌కి కోటిన్నర కట్టాల్సిందిగా దర్శకుల సంఘం తీర్పు ఇచ్చింది.
ఇది వరకు.. అశ్వనీదత్ దత్ దగ్గర సినిమా చేస్తానని అడ్వాన్సు తీసుకున్నాడు విక్రమ్. ఈమధ్యలో బయటి సంస్థలతో విక్రమ్ రెండు సినిమాలు పూర్తి చేశాడు.కానీ వైజయంతీ మూవీస్‌కి మాత్రం సినిమా చేయలేదు. ఈమధ్య ఎన్నిసార్లు అడిగినా, చూద్దాం, చేద్దాం అని తప్పించుకుంటున్నాడట విక్రమ్. దాంతో దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు అశ్వనీదత్.
వాదోపవాదాలు విన్న తరవాత... విక్రమ్ కె.కుమార్ రూ.1.5 కోట్లు జరిమానా చెల్లించాలని దర్శకుల సంఘం తీర్మాణించింది. ఇది వరకు తీసుకున్న అడ్వాన్సు కూడా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం నానితో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు విక్రమ్ కె.కుమార్. మైత్రీ మూవీస్ ఈచిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. అక్కడ తీసుకునే పారితోషికంలో కొంత భాగం వైజయంతీ మూవీస్‌కి బదలాయించాలన్నమాట.