'ఫీల్ ద పవర్' అంటూ అభిమానులు 'అజ్ఞాతవాసి' సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇండియాలోనూ, అక్కడ విదేశాల్లోనూ అభిమానులు ఒకే తరహాలో ఫీల్ ద పవర్ అంటూ 'అజ్ఞాతవాసి' మేనియాని ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు నాట ఎలాగూ రికార్డు స్థాయి ధియేటర్స్‌లో సినిమా విడుదలవుతోంది. విదేశాల్లో కూడా 'అజ్ఞాతవాసి' కనీ వినీ ఎరుగని స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ధియేటర్స్ సంఖ్య పరంగా రికార్డులు పవన్ కోసం ఎదురు చూస్తున్నాయి. తొలి రోజు వసూళ్ల సంగతి సరేసరి. ఆ సంగతి అలా ఉంటే, తాజాగా ఈ సినిమా పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో సారాంశం ఏంటంటే, అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గల యూనివర్సల్ స్టూడియోస్‌లో సిటీ వాక్ ధియేటర్స్‌లో 'అజ్ఞాతవాసి' ప్రదర్శింపబడుతోంది. ఇక్కడ ప్రదర్శితమవుతోన్న తొలి భారతీయ సినిమా 'అజ్ఞాతవాసి' కావడం విశేషం. 2018 జనవరి 9న సిటీ వాక్ ధియేటర్స్‌లో (ప్రీమియర్స్) సినిమాని ప్రదర్శించనున్నారు.
సంక్రాంతి సందర్బంగా ఇండియాలో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. పవన్‌కి జోడీగా ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో సినిమా ఇది. సాప్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. యంగ్ హీరో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే అనిరుధ్ మ్యూజిక్ ఉర్రూతలూగిస్తోంది. యూత్‌ని స్పెషల్‌గా ఆకట్టుకుంటోందీ ఆడియో. ఈ సినిమాతోనే తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు తమిళ యంగ్ డైరెక్టర్ అనిరుధ్.