మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులతో పాటు ప్రేక్షుకులు కూడా ఈ ప్రాజెక్ట్ అప్ డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలా ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే చిత్రబృందం ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోందట. ముఖ్యంగా ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో చాల సందిగ్ధత నడుస్తోంది. తన ప్రతి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ చేత మ్యూజిక్ చేయించుకునే అలవాటు ఉన్న కొరటాల, ఈసారి కూడా దేవినే పెట్టుకోవాలని అనుకుంటున్నాడు.
కానీ మొదట బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్, అతుల్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తారని, అలాగే మెలొడీ బ్రహ్మ మణిశర్మ పేరు కూడా వినిపిస్తోంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మణిశర్మ ఈ సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందించనున్నాడట. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయిన మణిశర్మ మాస్ సినిమాలకు సంగీతం ఇవ్వడంలో ఆయన పనితనం ఏమిటో అందరికీ తెలుసు. అంతేకాదు చిరు కెరీర్లో భారీ విజయాలుగా నిలిచిన 'ఇంద్ర, అన్నయ్య, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది' లాంటి చిత్రాలకు అద్బుతమైన మ్యూజిక్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ కూడా మణిశర్మకు ఉంది. అందుకే ఆయన్ను నేపథ్య సంగీతానికి తీసుకోవాలని చిరు భావిస్తున్నారట.
అయితే ఈ విషయమై చిత్ర బృందం నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. మొత్తానికి ఈ సినిమాకు దేవి పాటలను, మణిశర్మ ఆర్ఆర్ ఇవ్వనున్నారు అన్నమాట. ఇకపోతే ఈ సినిమాని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.