టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఏ దర్శకుడైనా సరే, మహేష్ బాబుతో ఒక్కసారైనా పనిచేయాలనుకుంటాడు. అప్పుడే బిగ్ లీగ్‌లో చేరినట్టుంటుంది. అందుకే `మహేష్ తో పనిచేయాలనివుంది` అంటూ చాలామంది కుర్ర దర్శకులు తమ మనసులోని మాట బయటపెట్టేస్తుంటారు. మరో దర్శకుడు కూడా మహేష్ పేరు కలవరిస్తున్నాడు.. తనే అజయ్ భూపతి.
ఆర్.ఎక్స్ 100తో సునామీలా విరుచుకుపడ్డాడు అజయ్ భూపతి. అయితే ఆ తరవాతి సినిమాని పట్టాలెక్కించడంలో విఫలం అయ్యాడు. ఎట్టకేలకు మహాసముద్రం కథ ఓకే అయ్యింది. దాన్ని పట్టాలెక్కించడం మాత్రం ఆలస్యం అవుతోంది. లాక్ డౌన్ వల్ల మహా సముద్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేకపోయింది. అయితే.. ఈలోగా మరిన్ని కథలు సిద్ధం చేసుకుంటున్నాడు ఈ యువ దర్శకుడు. మహేష్ కోసం కూడా ఓ కథ ఆలోచించాడట. అది చారిత్రక నేపథ్యంలో సాగే సినిమా అని, ఇప్పటికే మహేష్‌కి లైన్ కూడా వినిపించాడని టాక్. ఆ కథ మహేష్‌కి బాగా నచ్చిందని, అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా చేయడం కుదరదు కాబట్టి, తన కోసం అట్టిపెట్టమని చెప్పాడని సమాచారం. మహాసముద్రం పూర్తవ్వడానికి మరో యేడాది పడుతుంది. మహేష్ చేతిలోనూ చాలా సినిమాలున్నాయి. మరి ఈ కథని ఎప్పుడు పట్టాలెక్కిస్తారో. ఒకవేళ మహేష్ ఈ సినిమాలో నటించకపోయినా, నిర్మాతగానైనా ఉంటాడని, ఈ కథ మహేష్‌కి అంతగా నచ్చిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.