పూరి తనయుడిగా రంగ ప్రవేశం చేసిన ఆకాష్ పూరి, తనదంటూ ఓ మార్క్ సృష్టించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. 'మెహబూబా' పెద్దగా ఆకట్టుకోకపోయినా... `రొమాంటిక్` ఓకే అనిపించింది. బీ, సీ సెంటర్లలో యూత్ ఈ సినిమాని బాగానే చూశారు. ఆకాష్ పూరికి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా ఓవరాల్ రిజల్ట్ ఎలా ఉన్నా - తనకు మాత్రం చాలా సంతృప్తిని ఇచ్చిందని చెబుతున్నాడు ఆకాష్. ఈ సినిమాలో క్లైమాక్స్ చూసి తాను కూడా ఏడ్చేశాడట. ఆకాష్ వాళ్ల అమ్మ అయితే, సీను సీనుకూ ఏడుస్తూనే ఉన్నారట.
ఈ విషయాన్ని `రొమాంటి్` సక్సెస్ మీట్ లోచెప్పుకొచ్చాడు ఆకాష్ పూరి. ‘‘నాకు రజినీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. ఆయనే నాకు స్ఫూర్తి. మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ వరకు నన్ను అందరూ అంగీకరించే సినిమాలు చేయాలని ఉంది. కమర్షియల్, హ్యాపీ, ఫన్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తాను. నేను మొదటి సారి రొమాంటిక్ సినిమాలో క్లైమాక్స్ చూసి ఏడ్చాను. నేనే నటించాను కదా? ఎందుకు ఏడ్చాను అని అనుకున్నాను.
కానీ ఆ ఎమోషనల్ అలాంటిది. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ కథను నమ్మి చేశాం. క్లైమాక్స్‌లో నన్ను కొట్టే సీన్ నుంచి.. చివరి సీన్ వరకు అమ్మ ఏడుస్తూనే వచ్చింది. అంతా చూశాక.. ఇంత బాగా ఎలా నటించావ్‌రా అని అన్నారు. నా నటనను చూసి అమ్మ ఎంతో సంతోషించింది. నాన్నగారు చూసిన సక్సెస్‌లు వేరు. ఆయన స్థాయికి నేను వచ్చాక.. కాలర్ ఎగరేస్తాను. అది ఒక్క హిట్‌తో వచ్చేది కాదు. ఆ స్థాయికి వచ్చే వరకు ఎంత కష్టమైన పడతాను’’ అని అన్నారు.