ఓటీటీ సినిమా అనగానే... ప్రేక్షకులు భయపడిపోతున్నారు. వాటి ఫలితాలు అలా ఉన్నాయి మరి. స్టార్ సినిమాలు కూడా ఓటీటీ ముందు బోల్తా కొడుతున్నాయి. అలాంటి తరుణంలో ఎలాంటి అంచనాలూ లేకుండా వచ్చిన `ఆకాశం నీ హద్దురా` చక్కటి విజయాన్ని అందుకుంది. ఓటీటీలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో `ఆకాశం..` కూడా ఉంటుందని సినీ విశ్లేషకులు తేల్చేశారు. సినీ సెలబ్రెటీలు ఈ సినిమా బాగుందంటూ... ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ చిత్రానికి సూర్యనే నిర్మాత. థియేటర్లు ఎప్పటికీ తెరచుకోకపోవడంతో.. ఓటీటీకి ఇచ్చేశారు.
అమేజాన్ ప్రైమ్ ఈ సినిమాని 42 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. శాటిటైల్ హక్కుల ద్వారా.. ఈ చిత్రానికి మరో 20 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ రూపంలో మరో 10 కోట్లు గిట్టుబాటు అయ్యాయి. అలా... మొత్తానికి 70 కోట్ల బిజినెస్ చేసుకోగలిగింది. థియేటర్లలో విడుదల కాకపోయినా... దాదాపుగా 25 కోట్ల వరకూ ఈ సినిమా లాభాల్ని ఆర్జించిందని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. ఈమధ్య సూర్య సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్న వేళ.. కథానాయకుడిగానే కాదు, నిర్మాతగానూ `ఆకాశమే నీ హద్దురా` భారీ ఊరట కలిగించిందనే చెప్పాలి.