డిసెంబరు నుంచి థియేటర్లు తెరచుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల చిరంజీవి, నాగార్జున ఇద్దరూ... ముఖ్యమంత్రి కేసీఆర్ని కలుసుకున్నప్పుడు థియేటర్ల పునః ప్రారంభం గురించిన ప్రస్తావన వచ్చింది. అందుకు అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ చెప్పారు. సో... డిసెంబరులోనే థియేటర్ తాళాలు తెరచుకోవచ్చన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే నిర్మాతలు అందుకు సన్నాహాలు మొదలెట్టేశారు. ఇప్పటి వరకూ ఎవరూ అధికారికంగా విడుదల తేదీ ప్రకటించకపోయినా... తొలి అడుగు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ దే అయ్యి ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం `సోలో బతుకే సో బెటరు`. సుబ్బు దర్శకత్వం వహించారు.
బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేసే అవకాశాలున్నాయని ఇది వరకు ప్రచారం జరిగింది. జీ 5 ఈ సినిమా హక్కుల కోసం గట్టిగా ప్రయత్నించింది. దాదాపు 30 కోట్లకు బేరం కుదిరిందని చెప్పుకున్నారు. అయితే.. నిర్మాతలు ఇప్పుడు థియేటర్ విడుదలకే మొగ్గు చూపించారు. అందుకే.. ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. డిసెంబరు తొలి వారంలో థియేటర్లు తెరచుకున్నా, క్రిస్మస్కి గానీ.. ఊపు రాదు. సో.. క్రిస్మస్ బరిలో.. ఈ సినిమా ఉన్నట్టే.