స్టార్ హీరోల సినిమాలకు, కమర్షియల్ కథలకు ఒకే లెక్క. ఫ్యాన్స్ కి ఏం కావాలో అది ఇచ్చేయడం, భారీ యాక్షన్ సీన్లు, శక్తిమంతమైన డైలాగులు, ఎలివేషన్లు... ఇవుంటే చాలు. సినిమా పాస్ అయిపోవడం చాలా ఈజీ. ప్రస్తుతం బోయపాటి శ్రీను అదే చేశాడు. బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `అఖండ`. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ ని, ఫ్యాన్స్ ఆయనపై పెంచుకునే అంచనాల్ని బోయపాటి శ్రీను భలేగా పట్టేశాడు.
సింహా, లెజెండ్ లలో తాను చేసింది ఒక్కటే. ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేలా సన్నివేశాల్ని అల్లుకోవడమే. అందుకే ఆ రెండు సినిమాలూ సూపర్ హిట్టయ్యాయి. బాలయ్య,. బోయపాటి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అఖండ కోసం కూడా బోయపాటి ఇదే ఫార్ములా ఫాలో అయిపోయాడు.
అఖండ ట్రైలర్ ఆదివారం విడుదలైంది. అందులో కొత్తదనం ఏమీ లేదు. సింహా, లెజెండ్ లను పోలిన ఎలివేషన్లు, డైలాగులు కనిపించాయి. వినిపించాయి. అయితేనేం.. ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చేలా ఉన్నాయి ఆ సన్నివేశాలు. పైగా.. ఆ డైలాగుల్ని బాలయ్య పలికే విధానం చూస్తే... థియేటర్లో విజిల్స్, వన్స్ మోర్స్ వినిపించేలా ఉన్నాయి.
''అంచనాలు వేయడానికి నువ్వేమైనా పోలవరం డామా, పట్టుసీమ తూమా, పిల్ల కాలువ...''
''ఒకమాట నువ్వంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం... దైవ శాసనం..''
``ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే, బ్రేకుల్లేని బుల్డోజర్‌ని, తొక్కి పరదొబ్బుతా..
లైఫ్టా, రైటా, టాపా, బోటమా ఎటుదించి ఎటుపెట్టి గోకినా కొడకా... ఇంచు బాడీ దొరకదు''
''మీకు సమస్య వస్తే... దండం పెడతారు
మేం ఆ సమస్యకే పిండం పెడతాం..'' - ఇలా ప్రతీ డైలాగూ డైనమైట్ లా పేలింది. మొత్తంగా నందమూరి అభిమానుల్ని సంతృప్తి పరిచే మీటర్ లోనే ఈ సినిమా తీర్చిదిద్దినట్టు అర్థం అవుతోంది. ఫ్యాన్స్ కి నచ్చితే.. ఇక అడ్డేముంది? రికార్డులు బద్దలవ్వడం ఖాయం.