అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'హలో'. ఈ సినిమాని నాగార్జున అఖిల్‌కి రీ లాంఛింగ్ మూవీగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు ఈ రీ లాంఛింగ్‌ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు నాగార్జున. భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీ పడకుండా నాగ్ ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌లో నిర్మించారు. 'మనం' వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అక్కినేని ఫ్యామిలీకి అందించిన విక్రమ్ కుమార్ చేతుల్లో అఖిల్‌ని పెట్టాడు నాగార్జున.
'మనం' సినిమాలో అఖిల్‌ని గెస్ట్ రోల్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు విక్రమ్ కుమార్. అందుకే అఖిల్ రీ లాంఛింగ్ మూవీ బాధ్యత అంతా విక్రమ్‌కే అప్పగించేశాడు. అనుకున్నట్లుగానే అఖిల్‌ని సినిమాలో చాలా బాగా చూపించాడట. ట్రైలర్, టీజర్, ప్రోమోస్ తదితర ప్రచార చిత్రాలన్నీ సినిమాపై అంచనాల్ని పెంచుతూనే వస్తున్నాయి. అలాగే ఇవన్నీ ఒకెత్తయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని సరిగ్గా సినిమా విడుదలకి రెండు రోజులు ముందు నిర్వహించడం, ఆ ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధులుగా విచ్చేయడం, స్టేజ్‌పైనుండి అఖిల్ చిరంజీవిని పెదనాన్న అనీ, చరణ్‌ని పెద్దన్నయ్యా అని సంబోధించడం ఇవన్నీ సినిమా హైప్‌ని మరింత పెంచేశాయి.
అంతేకాదు, నాగార్జునతో కలిసి చిరంజీవి 'హలో' సినిమా చూసిన తర్వాతే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వచ్చారట. సినిమా చాలా బావుందంటూ, హీరోగా అఖిల్‌ని మరో మెట్టు ఎక్కేందుకు ఈ సినిమా దోహదపడుతుందనీ, ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుందనీ చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్ 'హలో'కి పెద్ద ప్లస్ పాయింట్. ఇలా ఇన్ని సానుకూల అంశాలు 'హలో' సినిమాకి పెద్ద హిట్ ఇస్తాయని ఆశించొచ్చు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.