రీల్ లైఫ్‌లో, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ప్రస్తావన తీసుకొస్తే ఆ కిక్కే వేరప్పా. ఎవరన్నా సెటైర్ వేసేదాకా ఎందుకు.? మన మీద మనకే వేసుకుంటే పోలా.? అని హీరోలు కొత్తగా ట్రై చేస్తున్నట్లున్నారు. ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ, దానికో లెక్కుంది..’ అంటూ ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెబుతాడు. అది పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్‌కి కూడా సూటవుతుందంటారు చాలామంది. ఆ సంగతి పక్కన పెడితే, ‘అల వైకుంఠపురములో’ సినిమాకి ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాగానే ‘గ్యాప్’ తీసుకున్నాడు. ఈ విషయాన్ని ‘ఏంట్రా గ్యాప్ తీసుకున్నావ్.?’ అని మురళీశర్మ ప్రశ్నిస్తే, ‘గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది..’ అని అంటాడు హీరో అల్లు అర్జున్ ఆ సినిమాలో. ఇక, ఇప్పుడు అక్కినేని అఖిల్, ‘కెరీర్‌ని బాగానే మేనేజ్ చేశా.. మ్యారీడ్ లైఫ్ మాత్రం..’ అంటున్నాడు.
ఇది అఖిల్ కొత్త సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రీ టీజర్ కథ. దీన్ని అఖిల్ రియల్ లైఫ్‌కి కనెక్ట్ చేస్తున్నారు చాలామంది నెటిజన్లు. అఖిల్ ఓ అమ్మాయిని ప్రేమించడం, పెద్దలు ఒప్పుకోవడం.. కొన్ని కారణాలతో చివరి నిమిషంలో పెళ్ళి క్యాన్సిల్ అవడం తెలిసిందే. దానికీ, దీనికీ ఏంటి సంబంధం.? అంటే, నెటిజన్లు అలా కనెక్ట్ చేస్తున్నారు మరి. కొందరైతే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అఖిల్‌ని. కానీ, అఖిల్ అభిమానులు ఇంకా గట్టిగా తమ అభిమాన హీరోని వెనకేసుకొస్తున్నారు. ఇది కూడా ఓ రకంగా పబ్లిటీనే అనుకోవాలేమో.! అంతే, చిన్న చిన్న వివాదాలు ఆయా సినిమాలకు ఎక్స్‌ట్రా పబ్లిసిటీ తెచ్చిపెడుతుంటాయి. కాగా, ‘గబ్బర్‌సింగ్’కి ‘తిక్క’ సెంటిమెంట్ కలిసొచ్చినట్లు, అల్లు అర్జున్‌కి ‘గ్యాప్’ సెంటిమెంట్ కలిసొచ్చినట్లు.. ఇప్పుడీ ‘మ్యారేజ్ ఇష్యూ’ అఖిల్‌కి కలిసొచ్చి, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సూపర్ హిట్ అవుతుందనే ఆశిద్దాం.