నటీనటులు : నందితా శ్వేత, సంజయ్ స్వరూప్, శకలక శంకర్, సత్య తదితరులు
దర్శకత్వం : బీ చిన్నికృష్ణ
నిర్మాతలు : అల్లూరి సురేశ్ వర్మ
సంగీతం : సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్ : నగేష్ బానెల్
ఎడిటర్: జీ సత్య
రేటింగ్: 2/5
ఓ సామాజిక అంశంతో కథని తెరకెక్కించడం, మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే... లోతుగా చెపితే `పాఠం`లా మిగిలిపోతుంది. పైపైన చెబితే లక్ష్యం నెరవేరదు. కమర్షియల్ అంశాలు పొందుపరిస్తే.. విషయం మరుగున పడిపోతుంది. అలాగని కేవలం పాయింట్ పైనే ఫోకస్ పెడితే - బోర్ కొట్టేస్తుంది. ఈ తూకం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శంకర్ లాంటి వాళ్లకే.. అది సాధ్యమైంది. మధ్యలో కొంతమంది ప్రయత్నించినా అందులో సక్సెస్ అయ్యింది చాలా తక్కువ. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సివస్తోందంటే... ఈ రోజు (శుక్రవారం) విడుదలైన సినిమాల్లో `అక్షర` ఓ సామాజిక అంశాన్ని సృశించింది. కార్పొరేట్ చదువులపై.. అస్త్రం సంధించాలని చూసింది. అది బలమైన పాయింటే. కానీ... సరైన తూకంలో చెప్పారా? అక్షరలో ఉన్న ప్లస్సులు, మైనస్సులేంటి?
* కథ
అక్షర (నందిత శ్వేత) ఓ అనాథ. చిన్నప్పటి నుంచీ చదువంటే చాలా ఇష్టం. టీచర్ అవ్వాలనుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యున్నతమైన సంస్థ అయిన విద్యావిధాన్ కాలేజీలో బోధకురాలిగా పనిచేస్తుంది. అయితే అదే కాలేజీలో ఓ విద్యార్థిని చదువుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. కాలేజీ యాజమాన్యం ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తుంది. అక్షర మాత్రం.. పిల్లలపై ఎలాంటి ఒత్తిడీ వేయకుండా కొత్త తరహాలో పాఠాలు బోధిస్తుంటుంది. తన పద్ధతి చూసిన శ్రీతేజ (శ్రీతేజ్) అక్షరని ప్రేమిస్తాడు.
అక్షర ఉండే కాలనీలోనే మరో ముగ్గురు అల్లరి కుర్రాళ్లు (సత్య, షకలక శంకర్, మధునందన్) కూడా ఉంటారు. వాళ్లూ అక్షరపై మనసు పారేసుకుంటారు. వాళ్లు తమ మనసులోని మాట బయటపెట్టే సమయంలోనే.. శ్రీతేజ హత్యకు గురవుతాడు. శ్రీతేజ మాత్రమే కాదు... ఏసీపీ ని కూడా ఒకరు దారుణంగా చంపేస్తారు. ఈ హత్యలు చేసిందెవరు? అసలు అక్షర వెనుక ఉన్న కథేమిటి? ఈ హత్యలకూ తనకూ ఉన్న సంబంధమేమిటి? ఇవన్నీ `అక్షర` చూస్తే తెలుస్తాయి.
* విశ్లేషణ
కార్పోరేట్ కాలేజీల దోపిడీ, దౌర్జన్యం, ర్యాంకుల కోసం పిల్లల్ని హింసించే విధానం.. వీటి చుట్టూ తిరిగే కథ ఇది. దాదాపుగా ఇలాంటి అంశాలనే పేపర్లలో చదువుతుంటాం. టీవీల్లో చూస్తుంటాం. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్.. ప్రేక్షకులకు అతి సుపరిచితమైనది. అత్యంత పాతది. అయితే దాన్ని మనసులకు హత్తుకునే విధంగా మాత్రం మలచలేకపోయాడు. ఇంట్రవెల్ వరకూ అసలు కథ ప్రారంభం అవ్వదు.
అప్పటి వరకూ కాలనీలో జరిగే వ్యవహారాలతో టైమ్ పాస్ చేశాడు దర్శకుడు. వాల్తేరు కింగ్స్.. షకలక శంకర్, సత్య, మధునంద్‌లు.. అక్షర వెంట పడడం, ఆమె దృష్టిలో పడడానికి వాళ్లు చేసే వింత చేష్టలూ... వీటి చుట్టూనే సగం సినిమా నడిచిపోతుంది. అయితే ఆ ట్రాక్‌లు ఏమాత్రం ఆసక్తిని తెప్పించకపోగా విసుగు కలిగిస్తాయి. ఆ ట్రాక్ ని దర్శకుడు బాగా రాసుకుని ఉంటే.. సినిమా చూడాలన్న ఆసక్తి, కుతూహలం ప్రేక్షకులలో కలిగేది. శ్రీతేజ్ హత్యతో.. ఇంట్రవెల్ బ్యాంగ్ పడుతుంది.
ద్వితీయార్థంలో అయినా కథ పరుగులు పెట్టాల్సింది. అక్షర ఫ్లాష్ బ్యాక్ భారంగా సాగింది. అయితే చెప్పాలనుకున్న పాయింట్లు మంచివే. కానీ దానికి తగిన స్క్రీన్ ప్లే లేకపోవడంతో ఆశయం అటకెక్కింది. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న అక్షర సడన్ గా పోలీసులకు లొంగిపోయి... తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మింగుడు పడని వ్యవహారం. సోషల్ ఇష్యూతో మొదలైన కథ, సగటు ప్రతీకార కథగా మారిపోవడం దర్శకుడిలోని వైఫల్యం. పతాక సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి ఊహలకు అనుగుణంగానే సాగుతాయి. మధ్యమధ్యలో ఎవరికి వారు స్పీచులు దంచి కొట్టే ప్రయత్నం చేశారు.
* నటీనటులు
అక్షరగా నందిత శ్వేత నటన ఫర్వాలేదనిపిస్తుంది. ప్రధమార్థంలో సంప్రదాయ బద్ధంగా కనిపించిన ఆ పాత్ర.. ఇంట్రవెల్ నుంచి టర్న్ తీసుకుంటుంది. ఆ వేరియేషన్స్ బాగానే చూపించింది. అయితే.. తనకు ఇచ్చిన డబ్బింగ్ సరిగా లేదు. అజయ్ ఘోష్ తొలిసారి నవ్వించడానికి ప్రయత్నించాడు. ముగ్గురు స్నేహితుల బ్యాచ్‌లో.. సత్య ఒక్కడే మెప్పిస్తాడు. శ్రీతేజ్ తేలిపోయాడు. హర్షవర్థన్ బరువైన పాత్రలో కనిపిస్తాడు.
* సాంకేతిక వర్గం
దర్శకుడు చిన్ని కృష్ణ చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. కానీ చెప్పే విధానం ఇది కాదనిపిస్తుంది. తొలిభాగంలో ఎలాంటి ఆసక్తికరమైన అంశాలూ లేకుండా.. కథ మొత్తం ద్వితీయార్థంలోనే చెప్పాలనుకోవడం ప్రధాన లోపం. అప్పటికే ప్రేక్షకులలో నీరసం ఆవహించేసింది. పాటలకు స్కోప్ లేని సినిమా ఇది. కెమెరా పనితనం బాగుంది.
* ప్లస్ పాయింట్స్
కథలోని పాయింట్
ఇంట్రవెల్ ట్విస్ట్
*మైనస్ పాయింట్స్
ప్రధమార్థం
కథనం
* ఫైనల్ వర్డిక్ట్: పాఠాలు ఎక్కువయ్యాయి