పవన్ కల్యాణ్ - అలీకి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ మంచి మిత్రులు. అయితే పార్టీ పరంగా వేరయిపోయారు. పార్టీలు వేరున్నా.. స్నేహ బంధాన్ని పక్కన పెట్టాల్సినపనిలేదు. దేని దారి దానిదే.
అయితే అలీ మాత్రం స్నేహానికంటే పార్టీలకు, పదవులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే మెడలో వైకాపా కండువా వేసుకోగానే.. పవన్‌కి వ్యతిరేకంగా కామెంట్లు చేశాడు. అప్పుడు పవన్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. ఎన్నికలు ముగిశాక.. జగన్ ప్రభుత్వం అలీని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో పవన్‌కి చేరువ అవ్వాలని చూశాడు అలీ. ఒకట్రెండు సందర్భాల్లో `మేమెప్పటికీ మంచి మిత్రులమే` అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడు అలీకి వైకాపా ప్రభుత్వం గౌరవ సలహాదారు పదవి ఇచ్చింది. అప్పటి నుంచీ.. అలీ స్వరం మళ్లీ మారింది. పవన్ ని, ఆయన ఫ్యాన్స్ ని మళ్లీ కెలకడం మొదలెట్టాడు. పవన్ పై పోటీ చేస్తానని ప్రకటించాడు. 175 స్థానాల్లోనూ వైకాపానే గెలుస్తుందని జోస్యం చెప్పాడు. స్నేహం స్నేహమే అని.. రాజకీయాల్లో ఎవరైనా ఒకటేనని కామెంట్లు చేశాడు.
ఇదంతా చూస్తుంటే పదవి కోసం.. పార్టీ కోసం అలీ ఏదైనా చేస్తాడు అనిపిస్తోంది. అలీ ఇంకా మారలేదని స్పష్టమవుతోంది. పవన్ ప్రశ్న ఎదురైనప్పుడు.. పవన్ తో పోటీ చేస్తారా? అని అడిగినప్పుడు `స్నేహితుల మధ్య చిచ్చు పెట్టకండి..` అని సున్నితంగా చెప్పి తప్పుకొంటే బాగుండేది. కానీ అలా చేయలేదు. అందుకే ఇప్పుడు అలీపై పవన్ అభిమానులు గుర్రుగా ఉన్నారు.