వెండి తెరపై హాస్య నటుడిగా అలీది తిరుగులేని ప్రస్థానం. దశాబ్దాలుగా అలీ నవ్విస్తూనే ఉన్నాడు. యువ హాస్య నటులు ఎంత మంది వచ్చినా తన స్థానాన్ని కాపాడుకొంటూనే వచ్చాడు. దాదాపు 13 వందల చిత్రాల్లో నటించిన అలీ... ఎవరికీ సాధ్యం కాని రికార్డుని సొంతం చేసుకొన్నాడు. బుల్లి తెరపై కూడా మెరిశాడు. ఈటీవీలో 'అలీతో సరదాగా' అనే టాక్ షో దిగ్విజయంగా నడుస్తోంది. ఏళ్ల తరబడి.. ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. అలీతో సరదాగా 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా అలీతో సరదాగా కాస్త సుమతో సరదాగా అయిపోయి.... అలీని సుమ ఇంటర్వ్యూ చేసింది. అలీతో సరదాగాలో.. ఇదే లాస్ట్ ఎపిసోడ్ అనుకోవచ్చు.
ఇక మీదట అలీ బుల్లి తెరపై కనిపించకపోవొచ్చని ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో తీరిక లేకుండా గడుపుతున్న అలీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం గౌరవ సలహాదారుడి పోస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన పదవికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే అలీ.. బుల్లి తెరకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. రోజా కూడా అంతే కదా..? మంత్రి పదవి వచ్చాక.. 'జబర్‌దస్త్' కి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు అలీ కూడా ఈ జాబితాలో చేరారని అనుకోవచ్చు.