వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా 'నారప్ప' సినిమాని ఈనెల 13న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమిళ `అసురన్`కి ఇది రీమేక్. కరోనా టైమ్ లో ఓటీటీలో విడుదలైంది. అప్పట్లో మంచి స్పందన వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాని థియేటర్లలో ప్రయోగాత్మకంగా విడుదల చేశారు. ఓటీటీలో మిస్ అయిన వాళ్లూ, థియేటర్లో ఈ సినిమాని చూడాలనుకొంటున్న వాళ్లూ.. తప్పకుండా ఈ సినిమా చూడ్డానికి థియేటర్లలోకి వస్తారని డి.సురేష్ బాబు భావించారు. అయితే.. ఈ సినిమాని జనం ఏమాత్రం పట్టించుకోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి ఈ సినిమాకి రూ.25 లక్షలు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అది ఖర్చులకు కూడా సరిపోదు. తిరిగి సురేష్ బాబు చేబులోంచి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినట్టైంది. నారప్పని థియేటర్లలో విడుదల చేయాలని ఎవరూ అడగలేదు.
సడన్ గా.. సురేష్ బాబు ఈ సినిమాని థియేటర్లలో వదిలారు. దానికి తగిన ప్రచారం కూడా చేసుకోలేదు. పైగా ఓటీటీల్లో ఈ సినిమాని అంతా చూసేశారు. ఇప్పుడు థియేటర్ లో పనిగట్టుకొని చూడాలన్న మూడ్ ఎవరికీ లేదు. ఎలాంటి ప్రచారం లేకుండా.. సైలెంట్ గా ఈ సినిమాని వదిలేయడం వల్ల.. జనం దృష్టిలో పడలేదు. అందుకే వసూళ్లు రాలేదు.వెంకటేష్ లాంటి అగ్ర హీరో సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం. సురేష్ బాబు.. పని గట్టుకొని మరీ వెంకీ పరువు తీసినట్టైందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.