అలీ రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. గత ఎన్నికలలో ఆయన వైకాపాకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. జగన్‌ని కలుసుకొని, ఆయన చేతుల మీదుగానే పార్టీ కండువా వేయించుకొన్నారు. జగన్ సీ.ఎం అయిన తరవాత ఒకట్రెండుసార్లు ఆయన్ని వ్యక్తిగతంగానూ కలుసుకొన్నారు. రాజ్యసభ సీటు కోసం అలీ ప్రయత్నిస్తున్నారని, అది దక్కడం ఖాయమని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అలీకి రాజ్యసభ సభ్యత్వం అందని ద్రాక్షే అయ్యింది. ఆ తరవాత ఏదో ఓ ప్రభుత్వ పదవి వస్తుందని ఆశించారు. అది కూడా దక్కలేదు. అసలు ఇప్పుడు వైకాపా పార్టీలో అలీ స్థానమేంటన్నది ఎవరికీ తెలియడం లేదు. ఆయన్ని జగన్, ఆయన అనుచరులు కూడా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అలీ.. వైకాపా నుంచి జనసేనలోని షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు.
పవన్ - అలీ మంచి స్నేహితులు. అలీ వస్తానంటే పవన్ కాదనడు. కాకపోతే అది అంత ఈజీ కాదు. జగన్ మోజులో అలీ.. పవన్ పై కొన్ని కామెంట్లు చేశాడు. అవి అప్పట్లో వైరల్ అయ్యాయి. అలీ - పవన్ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తరవాత... అవన్నీ సర్దుకొన్నా - పవన్ అభిమానుల్లో, ముఖ్యంగా జనసేన క్యాడర్ లో అలీ అంటే కొంత అసంతృప్తి ఉంది. కీలకమైన సమయంలో పవన్‌కు అలీ హ్యాండిచ్చాడనే అసంతృప్తి ఉంది. అందుకే అలీ వస్తానంటే వాళ్లు అడ్డుకొనే అవకాశం ఉంది. అలీ కూడా పవన్ పిలిస్తే... పార్టీలో చేరిపోదాం అనుకొంటున్నాడు. పవన్ అంత తేలిగ్గా పిలిచే రకం కాదు. ఆయన ఇంత వరకూ ఎవరినీ పార్టీలోకి ఆహ్వానించలేదు. వచ్చినవాళ్లకు అడ్డు చెప్పలేదు.
అలీ తనంతట తాను స్వయంగా పవన్‌ని కలుసుకొని, తన అభిప్రాయం చెప్పాలి తప్ప.. పవన్ పనిగట్టుకొని మరీ అలీని ఆహ్వానించే ఛాన్స్ లేదు. సో... ఇప్పుడు బంతి అలీ కోర్టులో ఉంది.