ఆర్.ఆర్.ఆర్‌లో ఓ కథానాయికగా అలియాభట్‌ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. నిన్నా మొన్నటి వరకూ అలియా భట్ ఈ సినిమాలో్ నటిస్తుందా, లేదా? అనే సందేహాలు ఉండేవి. అయితే రాజమౌళిపై ఉన్న మమకారంతోనో, పారితోషికంపై ఉన్న ప్రేమతోనో తెలీదు గానీ - హిందీ సినిమాల్ని సైతం పక్కన పెట్టి ఆర్.ఆర్.ఆర్‌లో నటించడానికి ముందుకొచ్చింది అలియా. అందుకు తగిన రీతిలో పారితోషికం అందుకోబోతోంది. ఈ సినిమాకి గాను అలియాకు 5 కోట్ల పారితోషికం దక్కబోతోందని టాక్. దక్షిణాదిన ఈ స్థాయిలో పారితోషికం అందుకున్న భామ అలియానే కావొచ్చు. బాలీవుడ్‌లో సైతం అలియాకు 5 కోట్ల పారితోషికం ఎవ్వరూ ఇవ్వలేదు. ఏరి కోరి మరీ తెచ్చుకున్నారుగా. అందుకే అడిగినంత ఇవ్వడానికి చిత్రబృందం సిద్ధమైంది.
అసలు విశేషం ఏమిటంటే... అలియా ఇచ్చిన కాల్షీట్లు పది రోజులు మాత్రమే. అంటే.. రోజుకి 50 లక్షలన్నమాట. అలియాకే ఇంతిస్తే.. మరి రామ్ చరణ్, ఎన్టీఆర్‌కి ఎంత ఇస్తున్నారో అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో మొదలైంది. ఈ సినిమాకి గానూ.. ఎన్టీఆర్, చరణ్ పారితోషికాలేం తీసుకోవడం లేదని, సినిమా లాభాల్లో వాళ్లకి వాటా ఉందని తెలిసింది. కనీసంలో కనీసం చెరో హీరోకి 20 కోట్లయినా ముట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.