'ఇష్క్', 'మనం' వంటి చిత్రాలతో తన డైరెక్షన్ స్టైల్ ఇదీ అని చూపించిన దర్శకుడు విక్రమ్ కుమార్. విక్రమ్ కుమార్ సినిమా అంటే, సమ్‌థింగ్ డిఫరెంట్ కంటెంట్ ఏదో ఉండే ఉంటుంది అనిపించేలా తనదైన మార్క్ వేయించుకున్నాడు ప్రేక్షకుల్లో. అయితే, ఈ మధ్య విక్రమ్ కుమార్‌కి పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. అఖిల్‌తో రూపొందించిన 'హలో' ఫెయిల్యూర్ కావడం, తర్వాత చాలా గ్యాప్ తీసుకోవడంతో విక్రమ్ కుమార్‌లో స్టఫ్ తగ్గిపోయిందా.? అనే అనుమానాలు నెలకొన్నాయి.
సరిగ్గా ఆ తరుణంలో నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమా ఒప్పుకున్నాడు విక్రమ్. కొత్త కాన్సెప్ట్‌తో సరికొత్త స్టైల్‌లో ఈ సినిమాని రూపొందించాడని ప్రోమోస్‌ని బట్టి అర్ధమవుతోంది. అయితే, సినిమాపై మరీ పెద్దగా అంచనాల్లేవ్ కానీ, 'గ్యాంగ్‌లీడర్' హిట్ అయితే, ఇటు నానికీ, అటు విక్రమ్ కుమార్‌కీ ఇద్దరికీ కలిసొస్తుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ శుక్రవారం నానీస్ 'గ్యాంగ్‌లీడర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సాహో' కోసం ముందుగా అనుకున్న డేట్‌ని పోస్ట్‌పోన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే, 'సాహో' ఆశించిన రిజల్ట్ అందుకోకపోవడంతో, అది ఈ వారం రాబోయే నానికి కలిసొచ్చే అంశమే. మంచి ఓపెనింగ్స్ అయితే, రాబట్టగలడన్న నమ్మకాన్ని ప్రోమోస్ కలిగిస్తున్నాయి. నాని తన మార్క్ డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి 'ఆర్‌ఎక్స్ 100' ఫేం కార్తికేయ విలనిజం మరో ప్రధాన ఆకర్షణ కానుంది. 'సాహో'తో బాగా నిరాశ పడిన బాక్సాఫీస్ నానీస్ 'గ్యాంగ్‌లీడర్'తోనైనా కాస్త ఊపిరి పీల్చుకుంటుందేమో చూడాలిక.