పీకల్లోతు ఫ్లాపుల్లో ఉన్నాడు అల్లరి నరేష్. తనకున్న `మినిమం గ్యారెంటీ హీరో` అన్న ట్యాగ్ కూడా ఫ్లాపులు ఎత్తుకెళ్లిపోయాయి. ఇప్పుడు యావరేజ్ సినిమా పడడమే గగనం అయిపోయింది. గ్యాప్ తీసుకుని, బాగా ఆలోచించి, సినిమాలు చేస్తున్నా.. ఫలితాలు తేడా కొట్టేస్తున్నాయి. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న `బంగారు బుల్లోడు` కూడా బాల్చీ తన్నేసింది. శనివారం విడుదలైన ఈ సినిమా.... డిజాస్టర్ ఖాతాలో చేరిపోయింది. ఓపెనింగ్స్ కూడా అస్సలు బాలేవు. రిపబ్లిక్ డే హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.
ఈ సినిమాపై నిర్మాతలు నాలుగు కోట్ల వరకూ పెట్టుబడి పెట్టారు. 3 కోట్ల బిజినెస్ జరిగింది. నిర్మాతల వరకూ సేఫ్. ఎందుకంటే, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో వాళ్లకు డబ్బులు గిట్టుబాటు అవుతాయి. మహా అయితే స్వల్ప నష్టాలతో బయటపడతారు. కానీ బయ్యర్లు అలా కాదు. 3 కోట్లకు కొంటే ఇప్పటికి 75 లక్షలు కూడా రాలేదు. అంటే.. 2 కోట్లు హుష్ కాకి అయినట్టే. నిజానికి ఈ సినిమాని చాలా హడావుడిగా విడుదల చేశారు. ఏమాత్రం పబ్లిసిటీ కూడా చేయలేదు. అసలే కరోనా టైమ్. నరేష్ టైమ్ బ్యాడ్ గా వుంది. ఇలాంటప్పుడు.. ఇంత హడావుడిలో ఈ సినిమా విడుదల చేయడం అవసరమా? అని ట్రేడ్ పండితులు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేసినా ఇంతేనని.... ఇంకొంతమంది వాదన. మొత్తానికి నరేష్ ఖాతాలో మరో అట్టర్ ఫ్లాప్ పడింది. దాని ఖరీదు.. రెండు కోట్లు.