థియేటర్ల మూసివేతతో.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కి మంచి గిరాకీ ఏర్పడింది. థియేటర్ల కోసం ఎదురు చూడలేక, వచ్చిన రేటుకి ఓ టీ టీకి అమ్మేసుకుంటున్నారు. ఓటీటీ కూడా కొత్త సినిమాలకు మంచి రేటే ఇస్తోంది. అందుకే చిన్న, మీడియం సైడు బడ్జెట్లు ఓటీటీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నాయి. తాజాగా మరో సినిమా... ఓ టీటీ చెంతకు చేరిపోయింది. అల్లరి నరేష్ కొత్త సినిమా `బంగారు బుల్లోడు` కూడా ఓ టీ టీకి సేల్ అయిపోయిందని టాక్.
అమేజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుందని సమాచారం. ఇప్పటికే శాటిలైట్ జెమినీకి వెళ్లిపోయింది. అమేజాన్ ద్వారా మంచి రేటే వచ్చింది. ఇవి రెండూ కలుపుకుంటే... బంగారు బుల్లోడు లాభాలతో బయటపడిపోయినట్టే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. 4 రోజులు ప్యాచ్ వర్క్ మాత్రమే బాకీ. అది కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.