రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా పేరు తెచ్చుకొని, హాస్య కథానాయకుడిగా ఎదిగాడు అల్లరి నరేష్. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు తను కేరాఫ్ అడ్రస్స్‌గా నిలిచాడు. ఒకప్పుడు చేతి నిండా సినిమాలు. యేడాదికి నాలుగు సినిమాలైనా వచ్చేవి. అందులో మినిమం ఒక్క హిట్ అయినా పడేది. అలా... మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకొన్నాడు. మధ్యలో గమ్యం, శంభో శివ శంభో లాంటి వైరెటీ పాత్రలూ చేశాడు. సుడిగాడుతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఆ వెంటనే డౌన్ ఫాల్ మొదలైంది. సరైన కథలు ఎంచుకోకపోవడం, కామెడీ పండకపోవడంతో వరుస దెబ్బలు తగిలాయి. ఆ ఫ్లాపుల నుంచి కొంత బ్రేక్ తీసుకోవడానికి 'మహర్షి'లో క్యారెక్టర్ ఆర్టిస్టు అవతారం ఎత్తాడు. ఆ సినిమా కొంతమేర ఉపశమనం కలిగించింది. నాంది లాంటి సీరియస్ కథలతో మరో టర్న్ తీసుకొన్నాడు. అలా సుదీర్ఘ విరామం తరవాత హీరోగా సక్సెస్ కొట్టాడు.
'నాంది' ఇచ్చిన స్ఫూర్తితో కొన్ని సీరియస్ కథలు ట్రై చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. మళ్లీ కామెడీ వైపు మనసు మళ్లింది. ఆ దారిలో ఆ ఒక్కటీ అడక్కు చేశాడు. ఈ శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. కానీ ఫలితం శూన్యం. నరేష్ నుంచి ఆశించే కామెడీ ఈ సినిమాలో అణుమాత్రం కూడా లేకపోవడం పెద్ద లోపం. నరేష్ కామెడీ టైమింగ్ పూర్తిగా తప్పేసింది. బహుశా.. రచయిత, దర్శకుడు నరేష్‌ని కావాల్సినట్టు మలచుకోలేకపోయారేమో..? 'ఆ ఒక్కటి అడక్కు' చూసినవాళ్లంతా నరేష్ ఇక సీరియస్ కథలవైపు దృష్టి పెడితే మంచిదని సలహా ఇస్తున్నారు. కామెడీ ట్రెండ్ పూర్తిగా మారిపోయిందని, ఆ ట్రెండ్ ని నరేష్ పట్టుకోలేకపోతున్నాడని, అందుకే నవ్వించలేకపోతున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రిజల్ట్ నరేష్ ని సందిగ్థంలో పడేసింది. ఇకపై కామెడీ కథలు ఒప్పుకోవాలంటే నరష్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే.