'అల్లరి' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, సమ్థింగ్ స్పెషల్ అనేట్లుగా కామెడీ హీరోగా గుర్తింపు పొందాడు అల్లరి నరేష్. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న హీరో అల్లరి నరేష్. అల్లరి నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే టాక్ సంపాదించాడు. అయితే గత కొంత కాలంగా అల్లరోడి సినిమాలకు ఆదరణ కరువైంది. అందుకు కారణం మూస కామెడీని అనుసరించడమే. అందుకే అల్లరోడు రూటు మార్చాడు. తాను చాలా మారిపోయానంటున్నాడు. కామెడీ సినిమాల్ని వదలడట కానీ, కామెడీలో కొత్తదనం చూపిస్తానంటున్నాడు. అలా మారిన నరేష్ కామెడీతో రాబోతున్న సినిమా 'మేడ మీద అబ్బాయి'. ప్రేక్షకులు కామెడీని ఆదరిస్తున్నారు. కానీ ఆ కామెడీలో కొత్తదనం కోరుకుంటున్నారు. ఒకప్పటి కామెడీ ఇప్పుడు చెల్లట్లేదు. అందుకే కామెడీకి సంబంధించి రచయితల ఆలోచనలు మారాలి అంటున్నాడు నరేష్. అలాగే కామెడీ హీరోగా తన ఆలోచనలు కూడా మారాయంటున్నాడు. ఈ రోజు నరేష్ పుట్టినరోజు. తండ్రి అయిన తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజు ఇది. ఎప్పుడూ నరేష్ తన పుట్టినరోజును సెట్లోనే ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవాడు. ఈ సారి అలా కాదట. తన భార్య, కూతురుతో బర్త్డే పార్టీని సరదాగా ఎంజాయ్ చేస్తానంటున్నాడు నరేష్. ఓకే మనం కూడా అల్లరోడికి బర్త్డే విషెస్ చెప్పేస్తూ, 'మేడ మీద అబ్బాయి' సినిమా విజయం సాధించాలని ఆశిద్దాం.