చిత్రసీమలో ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సిందే. ఓ హిట్టు కొట్టి రిలాక్సపోవడం కుదరదు. ఆ హిట్టుని నిలబెట్టుకోవాలంటే కష్టపడాలి. ఓ ఫ్లాపు వస్తే - ఆ చేదు జ్ఞాపకాల్ని చెరిపివేసి, మళ్లీ హిట్టు కొట్టి, రేసులోకి రావాలి. ప్రతి రోజూ ఓ పరుగు పందెమే. హీరోలకైతే నిత్యం ఫామ్ లో ఉండాల్సిందే. వరుసగా రెండు మూడు ఫ్లాపులు పడితే కెరీర్ గల్లంతయిపోతుంది. అయితే ఎన్ని ఫ్లాపులొచ్చినా మరో సినిమా సంపాదించుకోవడంలో పండిపోయాడు.. అల్లరి నరేష్. తన కెరీర్ కొన్నేళ్లుగా.. సరైన దిశలో పయనించడం లేదు. ఈ యేడాది కూడా లేటెస్టుగా `బంగారు బుల్లోడు`తో డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. ఇప్పుడు మరో సినిమా వస్తోంది. అదే... `నాంది`.
ఈ సినిమాపై నరేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన స్టైల్ కి విరుద్ధంగా వెళ్లి... చేసిన సీరియస్ ఫిల్మ్ ఇది. నరేష్ ఇలాంటి వెరైటీ ప్రయత్నాలు చేసిన ప్రతీసారీ... మంచి విజయమే లభించింది. ఈసారీ.. దాన్నే నమ్ముకున్నాడు నరేష్. తాను చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించే ఓ ఖైదీ కథ ఇది. జైల్లోంచి.. తాను ఎలా బయటపడ్డాడు? అనేది తెరపై చూడాలి. విజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈనెల 19న ఈ సినిమా విడుదల కానుంది. మరి.. ఈసారైనా పరీక్షలో పాస్ అవుతాడో, లేదో? నరేష్ ఈసారి కూడా తప్పితే... తన కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ లోకి వెళ్లిపోయినట్టే.