నటుడు రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ నటుడు అల్లరి నరేష్, లక్ష్మీదేవి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఆమె నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నానని అన్నారాయన. పలువురు సినీ ప్రముఖులు కనకాల కుటుంబంతో తమ అుబంధాన్ని గుర్తు చేసుకుని, లక్ష్మీదేవి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు సినీ నటిగా ఆమె పరిశ్రమకు చేసిన సాయం ఎంతో గొప్పది. 'ప్రేమబంధం' సినిమాలో సీనియర్ నటి జయప్రదకు తల్లిగా నటించారు. 'పోలీస్ లాకప్', 'కొబ్బరి బొండాం' తదితర సినిమాల్లో కూడా నటించారు. నటుడు దేవదాస్ కనకాలను పెళ్లాడారు. ఆమె సినీ పరిశ్రమలో చాలా మందికి తల్లి. రక్తం పంచుకుని పుట్టినోళ్లు రాజీవ్ కనకాల, శ్రీలక్ష్మీ అయితే ఆమె దగ్గర నటనలో పాఠాలు నేర్చుకుని నటులుగా, నటీమణులుగా కొత్త జన్మ ఎత్తిన వారెందరో ఉన్నారు.
నటనపై ఆసక్తి ఉన్న వారందర్నీ కన్నబిడ్డల్లాగే చేరదీసేవారట ఆమె. అందుకే వారందరూ ఆమెని తల్లిగానే గౌరవిస్తారు. దేవదాస్ కనకాల - లక్ష్మీదేవి శిక్షణలో ఆరితేరిన ఎంతో మంది నటీనటులు తెలుగు సినీ పరిశ్రమలో కనిపిస్తారు. అలా చూస్తే ఆమె సినీ పరిశ్రమలో చాలా మందికి తల్లి. అందుకే ఆమెని 'లక్ష్మీదేవమ్మ' అని గౌరవంగా పిలుస్తారందరూ. యాంకర్ సుమ కూడా ఆమె నాకు అత్తగారు కాదు, ఆమె నాకు అమ్మ అని చెబుతూంటుంది.
మలయాళీ కుట్టి అయిన యాంకర్ సుమ తెలుగులో గలగలా మాట్లాడేందుకు కారణం ఆమె అత్తగారైన లక్ష్మీదేవమ్మేనట. తెలుగు నేర్చుకోవడంలో అత్తగారు లక్ష్మీదేవి సుమకు చాలా సహాయం చేసేవారట. ఈ విషయం యాంకర్ సుమ చాలా సార్లు చెప్పారు గతంలో. అలాగే తెలుగు ఇండస్ట్రీలో చూస్తే పలువురు నటీ, నటులు ఆమె గొప్పతనాన్ని కథలు, కథలుగా చెబుతూ ఉంటారు. అందుకే ఆమె మరణం టాలీవుడ్‌ని అంతగా కలచి వేసింది.
'అమ్మది సంపూర్ణమైన జీవితం' అని రాజీవ్ కనకాల చెమర్చిన కళ్లతో చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లక్ష్మీదేవమ్మ మరణం పట్ల సంతాపం తెలియజేసింది.