థియేటర్ల కోసం ఎదురుచూసి, ఎదురు చూసీ నిర్మాతలు అలసి పోయారు. మెల్లమెల్లగా ఓటీటీకి దగ్గర అవుతున్నారు. బడ్జెట్లకు న్యాయం చేసే రేట్లు రాకపోయినప్పటికీ... ఎంతొస్తే అంత అనుకుని వచ్చిన రేటుకి సినిమాని అమ్మేసుకుంటున్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఓటీటీ వైపు మొగ్గు చూపడం లేదు. తమ సినిమాల్ని థియేటర్లలోనే చూడాలని పట్టుబడుతున్నారు. అల్లరి నరేష్ మాట కూడా అదే. ఓటీటీకి జనం ఇంకా అలవాటు పడలేదని, సినిమాల్ని థియేటర్లో చూసిన అనుభూతి వేరని అంటున్నాడు నరేష్. తన నుంచి `బంగారు బుల్లోడు`, `నాంది` సినిమాలు రాబోతున్నాయి. వీటిని ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీటిపై నరేష్ స్పందించాడు. తన సినిమాల్ని ఓటీటీకి ఇవ్వడం లేదని, ఆలస్యమైనా థియేటర్లలోనే చూస్తామని చెప్పుకొచ్చాడు.
ఓటీటీ అనేది బీ, సీ సెంటర్లకు ఇంకా అలవాటు కాలేదని, అక్కడి ఆడియన్స్ ఎక్కువని, తన సినిమాల్ని బీసీలలో బాగా చూస్తారని అలాంటప్పుడు కేవలం ఏ సెంటర్లకే తన సినిమా పరిమితం అవుతుందని, తన సినిమా అందరూ చూడాలంటే థియేటర్ల లోనే విడుదల కావాలని అన్నాడు. ''ఓటీటీ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. పరిస్థితులు మారతాయి. కచ్చితంగా థియేటర్లకు మంచి రోజులు వస్తాయి'' అని చెప్పుకొచ్చాడు నరేష్.