'అరవింద సమేత' సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాపై అంతటా ఉత్కంఠ నెలకొంది. మరోపక్క, త్రివిక్రమ్ డేట్స్ కోసం గత కొంతకాలంగా అల్లు అర్జున్ ఎదురుచూస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రూపొందేందుకు దాదాపుగా మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది.
మరో ఇద్దరు దర్శకుల పేర్లను ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ పరిశీలించినా, చివరికి త్రివిక్రమ్‌తోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. రేపు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో, గీతా ఆర్ట్స్ నుంచి ఓ ప్రకటన రాబోతోందనీ, అది బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా గురించేనన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో వాస్తవం ఎంతన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' రిజల్ట్‌తో అల్లు అర్జున్ బాగా డీలాపడిపోయాడు.
నిజానికి ఆ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు. కష్టతరమైన ఆర్మీ ట్రైనింగ్ తరహాలోనే శిక్షణ తీసుకున్నాడు. ఏం చేసినా, సినిమా ఫలితం మాత్రం అల్లు అర్జున్ ఆశించిన రీతిలో రాలేదు. ఇంకోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులూ తమ అభిమాన హీరో నుంచి ఓ సూపర్ డూపర్ హిట్‌ని ఆశిస్తున్నారు.
ఇదిలా వుంటే, అల్లు అర్జున్ కేరళకి వెళుతున్నాడు. కేరళ ప్రభుత్వం, తమ రాష్ట్రంలో జరిగే సంప్రదాయ పడవ పోటీలకు గౌరవ అతిథిగా అల్లు అర్జున్‌ని ఆహ్వానించడం గమనార్హం. అల్లు అర్జున్‌కి కేరళలో బోల్డంత ఫాలోయింగ్ వుంది. అక్కడతన్ని 'మల్లు అర్జున్' అని ముద్దుగా పిలుచుకుంటారు కూడా.