మెగా ఫ్యామిలీ హీరోగానే పరిచయమైన అల్లు అర్జున్ హీరోగా తనదైన స్టైల్‌లో స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అల్లు శిరీష్ ఆ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకోకపోయినా, హీరోగా డిఫరెంట్ చిత్రాలను ఎంచుకుంటూ కొత్త పంథాలో ముందుకెళ్తున్నాడు. ఈ రోజు అల్లు శిరీష్ తన 31వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
ఈ సందర్బంగా అల్లు అర్జున్ తన తమ్ముడికి బర్త్‌డే విషెస్ అందిస్తూ, ట్విట్టర్‌లో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్, భార్య స్నేహా, ఇద్దరు పిల్లల మధ్య శిరీష్ కేక్ కట్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోతో పాటు, శిరీష్‌ని నా మొదటి బేబీ అని సంబోధించాడు బన్నీ. 'జీవితంలో నా మొదటి బేబీ సిరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా కళ్లముందే ఈ బేబీ పెరిగి పెద్దవాడయ్యాడు..' అని అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ పట్ల తనకున్న ప్రేమాభిమానాన్ని తెలియజేశాడు.
ప్రస్తుతం శిరీష్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగులో 'ఏబీసీడీ' చిత్రంలో శిరీష్ హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో ఓ ప్రత్యేకమైన చిత్రంలో నటిస్తున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూర్య, మోహన్‌లాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదో మల్టీ స్టారర్ చిత్రం. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది.
త్వరలోనే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అందు కోసం చిత్ర యూనిట్ లండన్‌కి మకాం మార్చనుంది. మరోవైపు అల్లు అర్జున్ ఇటీవలే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.