ఓ హీరో ఫలానా నిర్మాతతో సినిమా చేయాలి అని అనుకున్నాడంటే, ఆ నిర్మాతకు ఎంతటి ప్రత్యేకత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ప్రత్యేకత గల నిర్మాతల్లో ఒకరు లగడపాటి శ్రీధర్. ఆయన నిర్మాణంలో తాజాగా రూపొందిన చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఎప్పటి నుండో లగడపాటి శ్రీధర్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నాను . అది ఇప్పటికి కుదిరింది. అవసరమైన దానికన్నా ఓ రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టాలి. సినిమా ఇంకా బాగా రావాలి అని తపన పడే నిర్మాత దొరకడం నా అదృష్టం..' అని అన్నాడు అల్లు అర్జున్.
రచయితగా ఎన్నో సక్సెస్‌లు అందుకున్న వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కొత్త దర్శకుడితో సినిమాకి ఇంత ఖర్చుపెట్టాలా అనే ఆలోచన లేకుండా, కేవలం సినిమా బాగా రావాలన్న ఒకే ఒక ఆలోచనతో ఆయన ఈ సినిమాకి పని చేశారు. అందుకే లగడపాటి శ్రీధర్ నిర్మాతల్లో ప్రత్యేకమైన వ్యక్తి అన్నాడు బన్నీ. తెలుగు చరిత్రలోనే బెస్ట్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని లగడపాటి శ్రీధర్ అన్నారు.
దేశభక్తి మిళితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విజువల్‌గా కొత్త ఫీల్‌నిస్తుందని చిత్రయూనిట్ చెబుతోంది. ముఖ్యంగా ఈ సినిమా విజయంపై డైరెక్టర్ వక్కంతం వంశీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటించింది. ఈ సినిమాకి విశాల్ - శేఖర్ అందించిన బాణీలు వినసొంపుగా అలరిస్తున్నాయి.