ఈ ఏపీ ఎన్నికలు మెగా అభిమానుల్లో మళ్లీ వర్గ పోరుకు తెర లేపాయి. అల్లు అర్జున్ వైకాపా అభ్యర్థి కోసం నంథ్యాల వరకూ వెళ్లి మద్దతు ఇవ్వడమే అందుకు కారణం. సొంత మావయ్యకు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపి, జనసేన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కోసం నేరుంగా రంగంలోకి దిగడం ఇబ్బందికరమైన విషయమే. తదనంతరం నాగబాబు చేసిన కామెంట్స్ మరింత హీట్ పెట్టాయి. ప్రత్యర్థుల కోసం పని చేసిన వాళ్లు సొంతవాళ్లయినా పరాయి వాళ్లకిందే లెక్క... అన్న మాట నేరుగా బన్నీని ఉద్దేశించిందే అన్నది అందరి అభిప్రాయం.
అయితే ఇది చాలా సున్నితమైన అంశం. బన్నీ చాలా విషయాల్లో స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఇష్టమైన వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు. స్నేహితుడికి ఇచ్చిన మాట కోసమే నంధ్యాల వెళ్లానని, తనకు ఇష్టమైన వాళ్లు ఏ పార్టీలో ఉన్నా, మద్దతు తెలుపుతా అని బన్నీ వివరణ కూడా ఇచ్చుకొన్నాడు. అయితే ఫ్యాన్స్ తగ్గడం లేదు. బన్నీకి నిజంగా ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే ఉద్దేశ్యమే ఉంటే.. బన్నీ కాంపౌండ్ నుంచి వచ్చిన బన్నీ వాసు, ఎస్‌కేఎన్ లాంటి వాళ్లు, జనసేనకు మద్దతుగా వెళ్లగలరా? వాళ్లని కూడా బన్నీ ఆపే ఛాన్స్ ఉంది కదా? బన్నీ అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని బన్నీవాస్, ఎస్‌కేఎన్.. బన్నీకి చెప్పకుండానే ప్రచారానికి వెళ్తారా?గత ఎన్నికల్లో బన్నీ సైతం బహిరంగ వేదికపై పవన్‌కి కలిశాడు. పార్టీకి తన వంతు సపోర్ట్ అందించాడు. రూ.2 కోట్ల విరాళం కూడా ప్రకటించాడు. ఫిల్మ్ ఛాంబర్‌లో రగడ జరుగుతున్నప్పుడు పవన్ దగ్గరకు బన్నీ స్వయంగా వెళ్లి తన మద్దతు అందించాడు. ఇవన్నీ మెగా ఫ్యాన్స్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో బన్నీని తప్పుగా అర్థం చేసుకొన్నారన్నది కొంతమంది బన్నీ సన్నిహితుల మాట. కాకపోతే.. బన్నీ కూడా స్వయంగా పిఠాపురం వెళ్లి, ఒక్కసారి కలిసి వచ్చేస్తే బాగుండేది అని జనసేన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అదొక్కటీ చేసేస్తే.. అసలు ఇంత దుమారం రేగేదే కదా? ఎలాగూ మెగా ఫ్యాన్స్ మధ్య అలకలు వచ్చాయి కదా అని బ్లూ మీడియా కూడా ఈ విషయాన్ని కాస్త భూతద్దంలోనే చూస్తూ.. ఈ చిచ్చుకి మరింత ఆజ్యం పోయడానికి చూస్తోంది. ఇలాంటప్పుడే మెగా ఫ్యాన్స్ కాస్త సంయమనంతో ఉండాలి. కాస్త మనసు పెట్టి ఆలోచించాలి.