ఏపీ ఎన్నికలు అయిపోయాయి. ఎవరి లెక్కలు వారివి. జనసేన కూడా కొత్త ఆశల్లో విహరిస్తోంది. జనసేనకు కనీసం 12 నుంచి 14 సీట్లు ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. పిఠాపురం నుంచి పవన్ గెలుపు లాంఛనమే. ఆయన మెజార్టీ ఎంతన్నదీ తేలాలంతే. ఈసారి పవన్ గెలిస్తే, అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాదు, మంత్రిగానూ బాధ్యతలు సీకరిస్తారన్న ఊహాల్లో, ఆశల్లో జనసేన ఊరేగుతోంది. టీడీపీకి జనసేన ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతోనే పొత్తులో భాగమైంది జనసేన. అంతేకాదు.. కాస్త దిగి వచ్చి, సీట్ల పంపకంలో కొన్ని త్యాగాలు చేయాల్సివచ్చింది. జనసేనలో కీలకమైన నేతలు కూడా తమ సీట్లని వదులుకొన్నారు.
వీటికి తగిన ప్రతిఫలం జనసేనకు దక్కే అవకాశాలు ఉన్నాయి. పవన్ త్యాగాలకు ప్రతిగా చంద్రబాబు క్యాబినేట్ లో ఒకరిద్దరు జనసేన మంత్రులు కనిపించే అవకాశం ఉంది. అందులో భాగంగా పవన్ కు సైతం కీలకమైన శాఖ అప్పగిస్తారన్న ఊహాగానాలు జనసేనలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే, తనకు ఏ శాఖ కావాలన్న విషయంలో ముందుగానే పవన్ చంద్రబాబు దగ్గర మాట తీసుకొన్నారని, ఆ ప్రకారమే.. పవన్‌కు మంత్రి పదవి దక్కబోతోందని తెలుస్తోంది. జనసేనలో మరో కీలకమైన నేత నాదెండ్ల మనోహర్‌కు సైతం మంత్రి పదవి దక్కబోతోందన్న వార్తలొస్తున్నాయి. తెనాలి నుంచి నాదెండ్ల గెలవడం దాదాపుగా లాంఛనమే. అక్కడ టీడీపీ బలం ఎక్కువ. వాళ్లంతా నాదెండ్ల గెలుపుకోసం అహర్నిశలూ శ్రమించారు. నాదెండ్ల కోసం దాదాపు పదేళ్లు జనసేనకు వెన్నుదన్నుగా నిలిచారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని పవన్ సిఫార్సు చేసినట్టు టాక్. ఒకవేళ జనసేనకు ఒక్క శాఖ మాత్రమే కేటాయిస్తే, అప్పుడు నాదెండ్ల కోసం పవన్ తన మంత్రి పదవిని త్యాగం చేసే అవకాశం ఉంది. అలాకాదని రెండు మంత్రిత్వ శాఖలు జనసేన ఖాతాలో వెళ్తే.. పవన్, నాదెండ్ల ఆ ఛాన్స్ అందిపుచ్చుకొంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.