యాధృచ్చికమో, కాకతాళీయమో తెలీదు గానీ - నిన్నటికి నిన్న చిరంజీవి మాట్లాడుతూ `కృష్ణగారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని` కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన తండ్రికి పద్మశ్రీ ఇవ్వాలని, అందుకోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని విన్నవించాడు. `అల వైకుంఠపురములో` సంగీత కార్యక్రమంలో బన్నీ తన మనసులోకి మాట బయట పెట్టాడు. తండ్రిపై తనకున్న ప్రేమ చూపిస్తూ, మాట్లాడుతున్నప్పుడే బన్నీ కన్నీటి పర్యంతం అవ్వడం మెగా అభిమానుల హృదయాన్ని తాకింది.
''నాన్న గురించి నేను, నాగురించి నాన్న ఎప్పుడూ స్టేజ్‌పై చెప్పుకోలేదు. నన్ను హీరోగా లాంచ్ చేసింది నాన్నే . సభాముఖంగా ఆయనకు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోలేదు. కానీ ఈరోజు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ కేవలం నాతో సినిమా చేసినందుకే కాదు.. కొడుకు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే. నేను మా నాన్నంత గొప్పగా ఎప్పుడూ కాలేను. ఆయనలో సగం కూడా కాలేను. నాన్నలో సగం ఎత్తుకు ఎదిగితే చాలనే ఫీలింగ్ కలుగుతుంది. మా నాన్నను నేను ప్రేమించినంతగా మరేవరినీ ప్రేమించను. నేను ఆర్య సినిమా చేసినప్పుడు అప్పట్లోనే కోటి రూపాయలు సంపాదించుకున్నాను. నాకు డబ్బుకు ఎప్పుడూ లోటు లేదు. అప్పటికీ పెళ్లైన తర్వాత నా భార్యను నేను అడిగింది ఒకే ఒకటి. నాకెన్ని కోట్లు ఉన్నా.. మా నాన్న ఇంట్లోనే ఉంటానని. మా నాన్నంటే అంత ఇష్టం. నేను చాలా మందిని చూసుంటాను. నేను చూసిన వారిలో ది బెస్ట్ పర్సన్ మానాన్నే. పది రూపాయల వస్తువుని ఏడు రూపాయలకు బేరం చేసిన తర్వాత ఆరు రూపాయలు ఇవ్వండి అన్నా.. వాళ్లింటికి వెళ్లి ఏడు రూపాయలు ఇచ్చేసే వ్యక్తి మా నాన్నగారు. 45 ఏళ్లుగా ఓ వ్యక్తి సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు. మనిషిలో ప్యూరిటీ లేకపోతే మనిషి ఇవాళ సౌత్ ఇండియాలో, ఇండియాలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ క్రింద ఉండలేరు.మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది. అలాగే మా నాన్నగారికి కూడా పద్మశ్రీ రావాలనే కోరిక ఉండేది. కాబట్టి మా నాన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సభావేదిక నుండి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన అందుకు అర్హుడు. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు''అంటూ తండ్రిపై తనకున్న ప్రేమని బయట పెట్టుకున్నాడు బన్నీ.