అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్‌కి అప్లయ్ చేసిన అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా దీనికి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోర్టును కోరారు. తాజాగా ఈ నిబంధనను కోర్టు మినహాయించింది. అలాగే విదేశాలకు వెళ్లేందుకు కూడా అల్లు అర్జున్‌కి కోర్టు పర్మిషన్ ఇచ్చింది.
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో బన్నీ అరెస్ట్ కావడం, బెయిల్ పై రావడం, రాజకీయంగా కూడా కలకలం రేగడం సంచలనంగా మారింది. ప్రస్తుతం బెయిల్ పై వున్నాడు బన్నీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా పనులు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు బన్నీ ముందున్న లక్ష్యం ఈ కేసుని నుంచి ఎలాంటి చిక్కులు లేకుండా బయటపడటమే.