అస్సలు అబద్దం చెప్పడమే చేతకాన్ని అమాయకునిలా కనిపిస్తున్నాడు 'అల వైకుంఠపురములో..' బన్నీ. 'నాన్నగారున్నారా? అని చమ్మక్ చంద్ర క్యారెక్టర్ అడిగితే, నాన్నగారు ఇంట్లో లేరండీ.. అని చెప్పమన్నారండీ నాన్నగారు..' అంటూ నిజం చెప్పేస్తాడు. నిజం చెప్పేటప్పుడు భయమేస్తుంది. కానీ, చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది.. అంటూ అబద్దాలు చెప్పని నిజమే చెప్పే కుర్రోడిలా బన్నీ క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడు. తండ్రీ కొడుకులుగా మురళీ శర్మ - బన్నీ కాంబో సీన్స్ సినిమాకి హైలైట్ అయ్యేలా ఉన్నాయి. అలాగే విలన్‌గా నటించిన సముద్రఖని పాత్ర త్రివిక్రమ్ గత చిత్రాల్లోని విలన్ పాత్రలకు ఎంత మాత్రమూ తీసిపోనట్లుంది.
సీనియర్ హీరోయిన్ టబు పాత్రను చాలా హుందాగా డిజైన్ చేశాడు. మిగిలిన క్యారెక్టర్లు జయరామ్, నవదీప్, సుశాంత్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్రప్రసాద్, నివేదా పేతురాజ్ తదితర పాత్ర చిత్రీకరణలు సందర్భానుసారం అన్నట్లున్నాయి. ఇక బన్నీ పాత్ర విషయానికి వస్తే, మంచోడైనా తక్కువోడేం కాదండోయ్. అన్యాయం జరిగితే, ఊరుకోడు. దడదడలాడించేస్తాడు. పులి లాంటోడు. అదీ మరి. అంతేగా 'పులొస్తే మేక చావాల్సిందేగా.' అందుకే ఆ డైలాగ్‌ని ఓ యాక్షన్ సీన్‌లో చొప్పించారు. ఈ మధ్య మూస కథలతో విసిగిస్తున్నాడు అన్న పేరు ఈ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి పోయేలా ఉంది. మేకింగ్‌లో కొత్తదనం కనిపిస్తోంది. ఖచ్చితంగా బొమ్మ హిట్ అని బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.