శ్రీవిష్ణు అంటే అల్లు అర్జున్‌కి ప్రత్యేకమైన అభిమానం. శ్రీవిష్ణు సినిమాల విడుదల సమయంలో... బన్నీ నుంచి ఓ ట్వీటో, ఓ మెచ్చుకోలో వస్తూనే ఉంటాయి. ఈసారి `అల్లూరి` ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బన్నీ ముఖ్య అతిథిగా వచ్చి, తన విషెష్ అందించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకొన్నాడు. ``శ్రీవిష్ణు చాలా మంచి నటుడు. తన అన్నిసినిమాలూ చూస్తుంటాను. కొత్తగా ఏదైనా ట్రై చేయాలని తపన పడుతుంటాడు. తను నాకు చాలా కాలంగా తెలుసు. కానీ ఎప్పుడూ ఏం అడగలేదు. ఈ సినిమా ప్రమోషన్‌కి హెల్ప్ చేయమని అడిగేసరికి కాదనలేకపోయా. పుష్ప 2 బిజీలో ఉండి కూడా వచ్చేశా..`` అని శ్రీవిష్ణుపై తన ప్రేమని చూపించాడు బన్నీ.
ప్రస్తుతం టాలీవుడ్ ట్రెండ్ గురించి కూడా మాట్లాడాడు. ``నిజానికి మనం మంచి ట్రెండ్ లో ఉన్నాం.చిన్న సినిమాలు ఆడుతున్నాయి. కొన్నిపెద్ద సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. కొన్ని ఆడుతున్నాయి. చిన్నా, పెద్ద అనేది ముఖ్యం కాదు. మంచి సినిమా తీశామా లేదా అనేదే ముఖ్యం. మంచి సినిమా అంటే తప్పకుండా నిలబడుతుంది. అలా ఈ అల్లూరి కూడా ఆడాలి`` అని కోరుకొన్నాడు బన్నీ. ఈనెల 24న అల్లూరి వస్తోంది. శ్రీవిష్ణు ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు.